8,200 అధిగమించిన నిఫ్టీ
66 పాయింట్లు లాభం
సెన్సెక్స్ 245 పాయింట్లు ప్లస్
27,372 వద్ద ముగింపు
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహం
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్ పురోగమించింది. ముందురోజు 130 పాయింట్లు ఎగసిన నిఫ్టీ తాజాగా 66 పాయింట్లు పుంజుకుంది. వెరసి మళ్లీ 8,200 పాయింట్ల కీలక స్థాయికి ఎగువన 8,225 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 245 పాయింట్ల వృద్ధితో 27,372 వద్ద స్థిరపడింది. గురువారం కూడా 416 పాయింట్లు జంప్‌చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన దిద్దుబాటు నేపథ్యంలో నిఫ్టీ 650 పాయింట్లు కోల్పోయిన కారణంగా మార్కెట్లో రిలీఫ్ ర్యాలీకి తెరలేచినట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. బుధవారం అర్థరాత్రి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రెట్ల పెంపునకు సంబంధించి మరికొంత కాలం వేచిచూడనున్నట్లు పేర్కొనడంతో వరుసగా రెండో రోజు ఆసియా, యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంట్ బలపడినట్లు నిపుణులు తెలిపారు.
లిస్టింగ్‌లో 12% మాంటె కార్లో డౌన్
దుస్తుల తయారీ సంస్థ మాంటె కార్లో ఫ్యాషన్స్ లిస్టింగ్ ఇన్వెస్టర్లను నిరుత్సాహపరచింది. రూ. 645 ధరలో ఇటీవలే పబ్లిక్ ఇష్యూ పూర్తిచేసుకున్న కంపెనీ షేరు తొలుత బీఎస్ఈలో 9% నష్టంతో రూ. 585 వద్ద లిస్టయ్యింది. ఆపై కనిష్టంగా రూ. 528ను తాకింది. ఇది 18%పైగా పతనమై, చివరికి 12% నష్టంతో రూ. 566 వద్ద స్థిరపడింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 350 కోట్లను సమీకరించగా, ఇష్యూకి దాదాపు 8 రెట్లు అధిక స్పందన లభించింది.ఎన్ఎస్ఈలోనూ 12% జారి రూ. 567 వద్ద ముగిసింది. 2 ఎక్స్ఛేంజీలలోనూ కలిపి 75 లక్షలకుపైగా షేర్లు ట్రేడయ్యాయి.