స్వాతి రాజకీయాపేక్ష
ఇది రాజకీయాల సమయం. త్వరలో ఈ రంగంలో పెద్ద సమరమే జరగనుంది. అదే విధంగా ప్రతి ఒక్కరూ రాయకీయాలపై ఆసక్తిని, అవగాహనను పెంపొందించుకుంటున్న కాలం ఇది. ఒకప్పుడు రాజకీయం, సినిమా వేర్వేరు. ప్రస్తుతం ఈ రెండూ కలగంపగా మారాయి. తారలు ప్రజాకర్షణతో లబ్ధి పొందాలనుకుంటున్నారు. చాలా మంది తారలు ఈ రాజకీయ గోదాలోకి దిగుతున్నారు. యువ నటి స్వాతి తానేమి తక్కువ కాదంటూ తన రాజకీయ ఆపేక్షను చెప్పకనే చెబుతున్నారు. తమిళంలో సుబ్రమణిపురం, పోరాళి, ఇదర్కుదానే ఆశై పట్టాయ్ బాలకుమారా తదితర చిత్రాల్లో నటించిన ఈ టాలీవుడ్ బ్యూటీ తెలుగులోనూ పలు చిత్రాలు చేశారు.
చాలా మంది తారల మాదిరిగానే ఈ అమ్మడికి రాజకీయ వ్యామోహం పెరిగిందనిపిస్తోంది. సీఎం అయితే ఏమి చేస్తారన్న ప్రశ్నకు స్వాతి కొంచెం కూడా తడుముకోకుండా పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. అవినీతి లేని సమాజాన్ని రూపొందించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సత్వర న్యాయం లభించడంలేదు. అలాంటి వారికి వెంటనే న్యాయం జరగాలి.
అందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ న్యాయస్థానంతో న్యాయమైన తీర్పులు అందించే చర్యలు తీసుకోవాలి అంటూ టకటకా చెప్పేస్తున్నారు. అయితే ఆమె చెప్పేవన్నీ నిజ జీవితంలో జరగడం అంతసాధ్యం కాదు. అలాంటి పాత్రలను సినిమాలో పోషించి స్వాతి తన ఆశలు నెరవేర్చుకోవాలని కోలీవుడ్ వర్గాలు సలహా ఇస్తున్నాయి. మరి స్వాతి ఏంచేస్తుందో వేచి చూడాలి.