ముగ్గురూ ముగ్గురే!
కడప అర్బన్ : ఢిల్లీ, కాన్పూర్, జైపూర్‌లో దాడు లు నిర్వహించి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ల చరిత్ర విస్తుగొలుపుతోంది. ఏళ్ల తరబడి వందలాది టన్ను ల దుంగలను జిల్లా నుంచి కొల్లగొట్టుకుని సొమ్ము చేసుకున్నారు. ఇటీవల అరెస్టు అయిన స్మగ్లర్లను పోలీసులు విచారించినపుడు వీరి గురించి తెలి సింది. ప్రత్యేకృబందాలను ఏర్పా టు చేసి వీరిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాటీ శుక్రవారం మీడియాకు ఈ స్మగర్ల గురించి వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కనౌజ్ పట్టణానికి చెందిన బద్రుల్ హసన్ అలియాస్ ఇమ్రాన్ భాయ్ 30 సంవత్సరాల కిందట ఢిల్లీలో స్థిరపడ్డాడు.
రెడీమేడ్ దుస్తుల తయారీ కేంద్రం నడుపుతున్నాడు. 20 ఏళ్ల కిందట తన గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరుకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పుడప్పుడు రైల్వేకోడూరుకు వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలో ఇతనికి జిల్లాలోని స్మగ్లర్లు జంగాల శివశంకర్, విశ్వనాథ్ రెడ్డి, రాయచోటికి చెందిన దర్బార్ బాషా, తిరుపతికి చెందిన వెంకట్ రెడ్డి, చెన్నైకి చెందిన మహ్మద్ అలీ అలియాస్ అలీభాయ్, కందస్వామి వెంకటేష్, వెంకటరామరాజు, రహిమాన్ సేట్, హవాలా శంకర్‌లతో సంబంధాలు ఏర్పడ్డాయి.
వారి వద్ద నుంచి ఎర్రచందనం దుంగలను ఢిల్లీకి తెప్పించుకుని చైనా, నేపాల్, దుబాయ్ దేశాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లకు విక్రయించేవాడు. ఇప్పటి వరకు 500 టన్నుల ఎర్రచందనం విక్రయించాడు. ఢిల్లీలోని ఇతని గోడౌన్లపై 2008, 2013లో ఫారెస్ట్, డీఆర్ఐ (డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) వారు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఇతను తన బంధువైన కాన్పూర్‌కు చెందిన నఫీజ్ హుసేన్ (మీనా ట్రాన్స్పోర్ట్) వాహనాల్లో దుంగలను ఢిల్లీ, జైపూర్ నగరాలకు తెప్పించుకుని గోడౌన్లలో నిల్వ చేసేవాడు. ఆ దుంగలను జైపూర్‌లో హస్తకళా వస్తువుల వ్యాపారం సేసే అశోక్ కుమార్ అగర్వాల్‌కు అమ్మేవాడు.
వాటిని అతను బొమ్మలు, పూసల దండలుగా తయారు చేసి చైనా, నేపాల్, దుబాయ్ దేశాలకు ఎగుమతి చేసేవాడు. నఫీజ్ హుసేన్.. బ్రూమ్ స్టిక్స్(ఇళ్లు శుభ్రం చేసే కర్రలు) మాటున ఎర్రచందనం దుంగలను హసన్ భాయ్, అశోక్‌కుమార్ అగర్వాల్ గోడౌన్లకు చేరవేసేవాడు. ఇతనికి వారు ఒక్కో లోడ్‌కు అదనంగా రూ.లక్ష ఇచ్చేవారు. భారతి ట్రేడర్స్ పేరుతో చందనం వ్యాపారం చేసే జైపూర్‌కు చెందిన అశోక్‌కుమార్ 2008లో తిరుపతికి చెందిన చిన్నయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకున్నాడు. అతని ద్వారా తిరుపతి పట్టణానికి చెందిన ఓ మహిళ ద్వారా ప్రభుత్వ అనుమతితో ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేసేవాడు. తర్వాత హసన్ భాయ్, నఫీజ్ హుసేన్‌లతో పరిచయం ఏర్పడటంతో వారి నుంచి దుంగలు కొనుగోలు చేసేవాడు. ఇతనికి దుబాయ్‌కి చెందిన పేరుమోసిన స్మగ్లర్ అలీభాయ్తో సన్నిహిత సంబంధాలున్నాయి.
పట్టుబడిన వైనం..
ఇటీవల అరెస్ట్ చేసిన స్మగ్లర్లను విచారించినప్పుడు వచ్చిన సమాచారం ఆధారంగా ఓఎస్డీ రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేకృబందాలు ఈ నెల 19న కాన్పూర్‌లో నఫీజ్ హుసేన్‌ను, 20న ఢిల్లీలో ఇమ్రాన్ భాయ్‌ని, 21న జైపూర్‌లో అశోక్‌కుమార్ అగర్వాల్‌ను అరెస్ట్ చేశాయి. వారి గోడౌన్లలో ఉన్న రూ.10 కోట్ల విలువైన 11.3 టన్నుల దుంగలు, మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు. వారిని ఆయా నగరాల్లోని కోర్టుల్లో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇమ్రాన్ భాయ్‌పై ఆరు కేసులు, నఫీజ్పై ఎనిమిది, అగర్వాల్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి.
టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ
స్మగ్లర్లను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన ఓఎస్డీ రాహుల్‌దేవ్ శర్మ సారథ్యంలోని టాస్క్‌ఫోర్స్ అధికారులు రాజంపేట డీఎస్పీ అరవింద బాబు, ఫాక్షన్ జోన్ డీఎస్పీ బి. శ్రీనివాసులు, సీఐలు జి. రాజేంద్రప్రసాద్, పి. శ్యాంరావు, రసూల్ సాహెబ్, సదాశివయ్య, ఎస్ఐలు హేమకుమార్, ఎన్. రాజరాజేశ్వర్ రెడ్డి, ఎస్ఎం. బాషా, షేక్ అన్సర్ బాషా, ఖాజామియా, హెడ్ కానిస్టేబుల్ వలీ, కానిస్టేబుళ్లు రమేష్, రవి, సుధాకర్, పెంచలయ్య, కొండయ్య, ప్రసాద్ నాయుడు, గోపీనాయక్లను ఎస్పీ అభినందించారు.