వరద పరవళ్లు..
తాలిపేరు ఏడు గేట్లు ఎత్తివేత– పర్ణశాల వద్దకు చేరిన జలం
దుమ్ముగూడెం/బూర్గంపాడు/పాల్వంచ రూరల్/చర్ల: గోదావరికి వరద ప్రవాహం పెరిగింది. పర్ణశాల, దుమ్ముగూడెం వద్ద పరవళ్లు తొక్కుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి పెరుగుతూ..గోదావరి ఆదివారం సాయంత్రానికి ఉధృతంగా మారింది. దుమ్ముగూడెం వద్ద 18 అడుగుల నీటిమట్ట నమోదైంది. పర్ణశాల వద్దకు జలం చేరడంతో..సీతమ్మ నారచీరలు, పర్ణశాల వద్ద స్నానఘట్టాలు నీట మునిగాయి. చర్ల మండలంలోని పెదమిడిసిలేరు సమీపంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి కొనసాగుతుండడంతో..ప్రాజెక్ట్ ఏడు గేట్లను ఎత్తారు. 23, 600 క్యూసెక్కుల చొప్పున వరదనీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బూర్గంపాడు మండలంలోని పెదవాగు, ఎదుర్లవాగు, కిన్నెరసానిలకు వరద భారీగా చేరుతోంది. పాల్వంచ వద్ద గల కిన్నెరసానిలోకి వరద పోటెత్తుతోంది. మొత్తం 407అడుగుల నీటి నిల్వ సామర్థ్యానికి 405.70 అడుగులకు నీటినిల్వ చేరింది. ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తనున్నట్లు డ్యామ్‌సైడ్ కేటీపీఎస్ ఈఈ ఉప్పలయ్య తెలిపారు.