'మాతో చేరకపోతే ఎత్తుకుపోతాం'
బాగ్దాద్: ఇస్లామిక్ ఉగ్రవాదులు అందాల భామలనూ వదలడం లేదు. తమతో చేరకపోతే ఎత్తుకుపోతామని బెదిరిస్తున్నారు. 40 ఏళ్ల తర్వాత మిస్ ఇరాక్ టైటిల్ గెల్చుకున్న షయమా ఖాసిం అబ్దెల్ రహమాన్(20)కు ఐఎస్ఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపు ఫోన్ వచ్చిందని 'జెరూసలెం పోస్ట్' వెల్లడించింది. తమ సంస్థలో సభ్యురాలిగా చేరాలని లేకుంటే కిడ్నాప్ చేస్తామని ఆమెను బెదిరించినట్టు తెలిపింది. ఐఎస్ఐఎస్ హెచ్చరికతో షయమా ఆందోళనకు గురైందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకెళ్లాలని ఆమె నిర్ణయించుకుందని అందాల పోటీ నిర్వాహకులు తెలిపారు.
'సమాజంలో ఇరాకీ మహిళ ఉనికి నిరూపించాలని కోరుకుంటున్నాను. పురుషులతో సమానంగా ఆమెకు హక్కులు ఉన్నాయి. నేను దేనికి భయపడడం లేదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉన్నా. నేనేం తప్పు చేయడం లేదు' అని ఉత్తర ఇరాక్ లోని కిర్ కుక్ ప్రాంతానికి చెందిన షయమా పేర్కొంది. అందాల పోటీలో పాల్గొనేందుకు 200 మంది ఆసక్తి చూపించారు. బెదిరింపుల కారణంగా చివరకు 10 మంది మాత్రమే పోటీలో పాల్గొన్నారని గ్రేవ్ మేగజీన్ తెలిపింది.