వ్యవసాయశాఖలో ‘నగదు బదిలీ’
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ జే.రవికుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రబీ సీజన్ నుంచి వ్యవసాయ శాఖలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. తొలుతగా సబ్సిడీపై ఇచ్చే వేరుశెనగ విత్తనకాయల కొనుగోలు నుంచి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.
బస్తా వేరుశెనగ విత్తనకాయలు రూ.1,620
ఈ సీజన్లో జిల్లాలోని తూర్పున 25 మండలాల్లో వేరుశెనగ పంట సాగుచేసే రైతుల కోసం నవంబర్ మొదటి వారం నుంచి విత్తనకాయలు అందుబాటులో ఉంచుతామని జేడీ వెల్లడించారు. ఇప్పటివరకు 24 వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. నగదు బదిలీ పథకం కింద బస్తా (30 కిలోలు) వేరుశెనగ కాయలను రూ.1,620 వెచ్చించి రైతు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. కొనుగోలు సమయంలో పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం కచ్చితంగా సమర్పించాలని సూచిం చారు. ఆ తర్వాత సబ్సిడీ కింద రూ.540లు రైతు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు.
64,060 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు
రబీ సీజన్లో జిల్లాలోని 64,060 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని జేడీ పేర్కొన్నారు. తూర్పు మండలాల్లో ప్రధాన పంటగా వరి 37,491 హెక్టార్లు, వేరుశెనగ 16,330, మిరప 2249, పొద్దుతిరుగుడు 2597, రాగి 821, మొక్కజొన్న 704, ఉద్దులు 1013, ఉలవలు 1768, పొగాకు 123, ఎర్రగడ్డలు 196 , పత్తి 118 హెక్టార్లు, కాగా మిగిలిన విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని తెలిపారు.
అందుబాటులో ఎరువులు
రబీ సీజన్‌కు గాను వివిధ రకాల ఎరువులు జిల్లాలోని రైతులకు అందుబాటులో ఉంచామని జేడీ తెలిపారు. యూరియా 11600 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2773 టన్నులు, ఎంవోపీ 839, కాంప్లెక్స్ ఎరువులు 8400 టన్నులు అందుబాటులో ఉన్నాయన్నారు. నవంబర్ మొదటి వారంలో మరో 26 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు వస్తాయని ఆయన వివరించారు.