ఈ కారుంటే.. కరెంటును అమ్ముకోవచ్చు!
ఒకప్పటి మాట... ఫోన్‌తో కేవలం అవతలి వ్యక్తితో మాట్లాడటం మాత్రమే వీలయ్యేది. మరి ఇప్పుడు... ఫోన్‌తో చేయలేని పనంటూ ఏదీ లేదు. చిత్రమైన విషయమేమిటంటే... వందేళ్లకుపైగా మనం వాడుతున్న కార్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కొన్ని అదనపు హంగులు వచ్చి చేరాయి గానీ.. లేకుంటే మనుషుల్ని అటూ ఇటూ రవాణా చేసేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ.. ఫొటోలో కనిపిస్తోందే... ఆ కారు రోడ్లపై తిరగడం మొదలుపెడితే మాత్రం పరిస్థితి మారిపోతుందంటున్నారు! జపనీస్ సంస్థ టయోటా తయారు చేసిన ఈ సూపర్ కారు పేరు ‘ఎఫ్‌సీవీ ప్లస్’. కాలుష్యం బాధలేకుండా ఇది హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తుంది. అంతేకాదు... ఇదోవిద్యుత్ జనరేటర్ కూడా. ఇంట్లో, లేదంటే ఆఫీసులో మీరు దీన్ని పార్క్ చేశారనుకోండి.
అది ఊరికే కూర్చోదు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హైడ్రోజన్ ట్యాంకులకు కనెక్ట్ అయిపోయి నిశ్శబ్దంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్తును బ్యాటరీల్లో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చునన్నమాట. ఒకవేళ మీకు అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్తు ఉంటే దాన్ని గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు కూడా. అదీ కాదంటే.. ఈ విద్యుత్తును ఇతర కార్లకు సరఫరా చేయవచ్చు కూడా. అంతేకాదు... దీంట్లో ఇంజిన్ మొత్తం ఒకచోట మాత్రమే ఉండదు. ఒక్కో చక్రంలో ఒక్కో విద్యుత్ మోటర్ ఉంటుంది. అలాగే హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మార్చే ఫ్యుయెల్‌సెల్ ముందువైపు ఉంటే.. హైడ్రోజన్ ట్యాంకును వెనుకవైపు ఏర్పాటు చేశారు. ఉత్పత్తయ్యే విద్యుత్తు వైర్లెస్ పద్ధతిలో బ్యాటరీల్లోకి చార్జ్ అవుతుంది. టయోటా గత ఏడాది తొలిసారి ఇలాంటి ఫ్యుయెల్‌సెల్ వెహికల్ (ఎఫ్‌సీవీ)ను అభివృద్ధి చేసింది. దీన్నే మరింత ఆధునీకరించి ఎఫ్‌సీవీ ప్లస్‌గా పారిస్ మోటర్షోలో ప్రదర్శించనుంది.