Jinnuru
-
పెనుగొండలో మళ్లీ లాక్డౌన్
సాక్షి, పెనుగొండ: కరోనా విలయతాండవం చేస్తుండటంతో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అధికారులు మళ్లీ లాక్డౌన్ పెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుంచి లాక్డౌన్ ప్రారంభించారు. ఏప్రిల్ 1న ప్రారంభమైన రెడ్ జోన్ జూన్ మొదటి వారం వరకూ కొనసాగింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పెనుగొండలో నిషేధాజ్ఞలు తొలగించారు. అయితే చెరుకువాడలో కోయంబేడు కాంటాక్టుతో ప్రారంభమైన కరోనా వ్యాప్తి ఏకంగా 25 కేసులు దాటేసాయి. ఆదివారం నాటికి కొందరు ఐసోలేషన్ నుంచి డిశ్చార్జి కాగా, చెరుకువాడలో ప్రస్తుతానికి 19 యాక్టివ్ కేసులున్నాయి. దీనికి తోడు ఆచంట నియోజవర్గంలోని పోడూరు, పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని పోడూరు మండలంలోని జిన్నూరులో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పెనుగొండ–నరసాపురం రహదారిలో రాకపోకలు నిషేధించి ఆచంట, వీరవాసరం మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. (ఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు) నరసాపురం రహదారిలో రాకపోకలు నిషేధిస్తూ మార్టేరులో ఏర్పాటు చేసిన బారికేడ్లు ఇదిలా ఉండగా చెరుకువాడలోనూ కరోనా కట్టడికి కఠిన నిషేధాజ్ఞలు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు, సంబంధిత అధికారులు పెనుగొండ, చెరుకువాడను పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. 10 రోజులుగా చెరుకువాడకే పరిమితం చేసిన కంటైన్మెంట్ పరిధిని కిలోమీటరుకు పెంచడంతో పెనుగొండ, చెరుకువాడ పూర్తిగా నిషేధాజ్ఞల ప్రాంతంలోకి వచ్చాయి. దీంతో ఉదయం కేవలం రెండు గంటల పాటు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అధికారులు అవకాశం కల్పించారు. రెండు గంటల సమయంలోనూ ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే మరింత కఠినంగా అమలుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిషేధాజ్ఞలతో పాటు రెండు ప్రాంతాల్లోని కల్యాణ మండపాలు, కమ్యూనిటీ భవనాలను అధికారులు పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్నారు. అధికారులకు తెలియకుండా కొందరు ఫంక్షన్లు నిర్వహిస్తున్నారన్న సమాచారం ఉండడంతో ఇబ్బందులెదురయ్యే అవకాశాల కారణంగా వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే చెరుకువాడలోని ప్రజలు 80 రోజులకుపైగాను, పెనుగొండలో ప్రజలు సుమారు 65 రోజులపాటు కంటైన్మెంట్లో మగ్గిపోయారు. మళ్లీ కంటైన్మెంట్ ప్రారంభం కావడంతో మరికొంత కాలం మగ్గిపోవలసి వస్తుంది. దీంతో ప్రజలు ఎవరికి వారు అప్రమత్తం అవుతున్నారు. మట్టపర్రు రోడ్డు వద్ద పాలకొల్లు–మార్టేరు స్టేట్ హైవేను మూసివేసిన దృశ్యం జిన్నూరులో మరో 8 కరోనా కేసులు 38కి చేరిన మొత్తం కేసుల సంఖ్య పోడూరు: కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న జిన్నూరు గ్రామంలో ఆదివారం మరో 8 కేసులు నమోదైనట్లు కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ సీహెచ్ దేవదాసు తెలిపారు. దీంతో గ్రామంలో కేసుల సంఖ్య 38 పెరిగింది. కొత్తగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి, మరో వ్యక్తికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. జిన్నూరులో కరోనా ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిన్నూరులో కరోనా ప్రభావంతో ఇప్పటికే పాలకొల్లు–మార్టేరు స్టేట్ హైవేపై రాకపోకలు నిషేధించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జిన్నూరు నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, బయట వ్యక్తులు గ్రామంలోకి రాకుండా అన్నిదారులూ మూసివేశారు. ఎంపీడీఓ కె.కన్నమనాయుడు, తహసీల్దార్ పి.ప్రతాప్‌రెడ్డి, గ్రామస్థాయి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. (రూ.350కే కరోనా పరీక్షలు!) -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘ఐడియల్’
జిన్నూరు (పోడూరు) : స్థానిక ఐడియల్ స్కూల్ విద్యార్థులు 14 మంది ‘తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించారు. సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన ‘నైమిశ వేంకటేశ శతకం’లోని 108 పద్యాలను 1,850 మంది ఏకకాలంలో ఏక కంఠంతో గానం చేసిన శతకధారణ కార్యక్రమం ద్వారా తమ విద్యార్థులు ఈ ఘనత సాధించినట్టు కరస్పాండెంట్ ఏవీ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. గుంటూరు సం పత్‌నగర్‌లోని శారదా పరమేశ్వరి ఆలయం లో ఈ నెల 19న ఈ కార్యక్రమం జరిగిందన్నారు. 1,850 మందిలో తమ విద్యార్థులు కలిగొట్ల మేఘన, యాండ్ర తేజస్వి, పెన్మెత్స రేణుక, బొర్రా మౌనిక, గోపరాజు కృష్ణలహరి, మల్లుల భావన, ఎస్.వెన్నెల, రావూరి నవ్యశ్రీ, సిరిమల్ల లక్ష్మీప్రియ, నుదురుపాటి సుబ్రహ్మణ్యం, సిరిమల్ల మణికంఠ కార్తీక్, ఎస్.శ్రీకార్తికేయ, మామడిశెట్టి బేబీ శ్రీ మంజు, కె.సాయిశ్రీ పవన్ ఉన్నారని చెప్పారు. వీరిని, శిక్షణనిచ్చిన టీచర్ మణిని అభినందించారు.