ఇరుక్కుపోయిన కలెక్టర్!
► పతాక స్థాయికి చేరిన మృణాళిని, స్వాతిరాణి విభేదాలు
► జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో రహస్య సమావేశం
► సీఎం, అశోక్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న చైర్పర్సన్ వర్గం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. జిల్లాలో చక్రం తిప్పాలని జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి ఉవ్విళ్లూరుతుండగా, తాను చెప్పినట్టు జరగాలని మంత్రి మృణాళిని ఆరాటపడుతున్నారు. వీరి మధ్య గొడవ కలెక్టర్ ఇరుక్కుపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి, కలెక్టర్‌ను తీరును తప్పుపడుతూ జెడ్పీ చైర్పర్సన్ వర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం, అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లాలని మంగళవారం చైర్పర్సన్ ఛాంబర్లో జరిగిన రహస్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదెక్కడికి దారితీస్తుందో తెలియదు గాని జిల్లా పాలనపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మంత్రి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి మధ్య ఏడాదిగా పొసగడం లేదు. తాజాగా వైద్య ఆరోగ్య సమీక్ష వారి మధ్య చిచ్చు రేపింది.
ఇటీవల కుమారుడ్ని కోల్పోయిన విజయనగరం జెడ్పీటీసీ తుంపల్లి రమణను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సీజనల్ వ్యాధులపై ఒక సమీక్ష నిర్వహించాలని తనను కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆదేశించినట్టు జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి చెబుతున్నారు. ఆ కారణంతోనే ఒక సమీక్ష నిర్వహించాలని జెడ్పీ సీఈఓ, డీఎంఅండ్హెచ్ఓకు చైర్పర్సన్ సూచించారు. ఆమేరకు సమీక్షా తేదీ( జూలై 28)ని ఖరారు చేశారు. అందులో భాగంగా సోమవారం అటు జెడ్పీటీసీలు, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జెడ్పీ చైర్పర్సన్ సమాచారం అందించారు. ఆ తర్వాత హైడ్రామా మొదలయింది.
అదే రోజు రాత్రి కలెక్టర్ ఎం.ఎం.నాయక్ జోక్యం చేసుకుని జెడ్పీ చైర్‌పర్సన్‌కు ఫోన్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితిలో సమావేశం నిర్వహించొద్దని, మంత్రి మృణాళిని వద్దన్నారని కలెక్టర్ చెప్పినట్టు తెలిసింది. అయితే, జెడ్పీ చైర్పర్సన్ సమీక్ష రద్దు చేయడం కుదరదని, నిర్వహించి తీరుతామని గట్టిగా చెప్పినట్టు తెలియవచ్చింది. ఈ క్రమంలో సమీక్షకు హాజరు కావద్దని అధికారులకు కలెక్టర్ చెప్పినట్టు, ప్రజా ప్రతినిధులకు మంత్రి ఆదేశించినట్టు గుసగుసలు వినిపించాయి. మొత్తానికి సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కాకపోతే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మృతి చెందడంతో సమీక్ష చేసేందుకు అవకాశం లేక సంతాపానికి పరిమితమయింది. ఆ తర్వాత జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో టీడీపీ ప్రజాప్రతినిధులతో రహస్య సమావేశం జరిగింది. ఇందులో మంత్రి మృణాళిని, కలెక్టర్ ఎం.ఎం.నాయక్ లక్ష్యంగా చేసుకుని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ముందుగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ కలెక్టర్ తనకు పోన్ చేసి సమీక్ష నిర్వహించొద్దని, మంత్రి మృణాళిని వద్దని చెప్పారని, సమీక్ష నిర్వహించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని చెప్పినట్టు వివరించారు. ఈ సందర్భంలో కలెక్టర్‌తో వాగ్వాదం కూడా జరిగిందని తెలిపారు.
‘ తనతో మాట్లాడే తీరు ఇదేనా...అంతా ఇగోకు పోకూడదని...కలెక్టర్ ఘాటైనా స్వరంతో అన్నారని, తాను కూడా వెనక్కి తగ్గలేదని జెడ్పీ చైర్‌పర్సన్‌తో మాట్లాడేది ఇలాగేనా అంటూ కలెక్టర్‌తో గట్టిగా మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. సోమవారం రాత్రి జరిగిన పరిణామాల్ని అశోక్ దృష్టికి తీసుకెళ్లగా అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదని, అటెండెన్స్ రిజిస్టర్ పెట్టి సమీక్ష నిర్వహించాలని, అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్టు కూడా స్వాతిరాణి తన అనుయాయులకు వివరించారు. ఈ సందర్భంలో మంత్రి గ్రూపుగా భావిస్తున్న ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో పాటు ఎమ్మెల్యేలు కె.ఎ.నాయుడు, మీసాల గీత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తదితరులు వరుసగా కలెక్టర్, మంత్రి తీరును తప్పు పడుతూ మాట్లాడినట్టు తెలిసింది. జగదీష్ కాస్త ఆచితూచి మాట్లాడినా మిగతా ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్టు తెలిసింది. కొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలైతే తేల్చుకుందామనే దోరణితో మాట్లాడారు. చివరిగా వ్యవహారాన్ని సీఎం దృష్టికి, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లి ఏదొకటి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.