అంతా మా ఇష్టం
- నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కబేళాలు
- నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు
- ఆపదలో ప్రజారోగ్యం
- మొద్దునిద్రలో అధికారులు
అనంతపురం న్యూసిటీ : నగరంలో నిబంధనలకు విరుద్ధంగా కబేళాలను నిర్వహిస్తున్నారు. నగరంలోని మరువకొమ్మ కాలనీ, గుల్జార్‌పేట, కళ్యాణదుర్గం బైపాస్ సమీపంలో కబేళాలను ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. ఇక గొర్రెలు, మేకలు, పొట్టేళ్లను ప్రతి వీధిలో చిల్లరకొట్లు ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నారు. పశువులను పరీక్షించకుండానే విక్రయిస్తున్నారు. దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తప్పక పడుతుందని వైద్యులంటున్నారు. తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన నగరపాలక సంస్థ, పశు శాఖ అధికారులు అటువైపు తొంగిచూడటం లేదు.
ఇష్టానుసారంగా విక్రయాలు
మరుకొమ్మ కాలనీ, గుల్జార్‌పేట, కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతాల్లో ఆవులు, ఎద్దులను కోసి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇక్కడ వ్యాపారులు నిర్వహించే తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. భగవంతుడా ఇటువంటి మాంసాన్ని తీసుకుంటారా అన్న ఆలోచన రాకమానదు. వెటర్నరీ వైద్యులు పరీక్షలు నిర్వహించకుండానే ఆవులు, ఎద్దులను వధిస్తున్నారు. సాధారణ నియమ నిబంధనలను అసలే పాటించడం లేదు. మరువకొమ్మ కాలనీకు అనుకుని కాలువ ఉంది. ఆవులు, ఎద్దుల రక్తం పారుతూనే కనిపిస్తుంటుంది. ఆరుబయట గోడలకు గోవులు, ఎద్దుల మాంసాన్ని తగిలేశారు. వాటిపై ఈగలు, దోమలు, బ్యాక్టీరియా వాలుతున్నా ఎవరికీ పట్టడం లేదు.
కంపు మార్కెట్
అపరిశుభ్రతకు కేరాఫ్‌గా పాతూరు మటన్ మార్కెట్ నిలుస్తోంది. మార్కెట్ ఆరుబయట నుంచి లోపల భాగంలో కంపు కొడుతోంది. గొర్రెలు, పొట్టేళ్లను అక్కడే వధించడంతో పాటు కాల్చుతుంటారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా విక్రయిచ్చేస్తున్నారు. మాంసం వ్యర్థలు, ఈగలు, దోమలతో ఎప్పుడూ అక్కడ అపరిశుభ్రత నెలకొంటోంది. అలాగే నగరంలతో కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న చాలా మాంసం దుకాణాలకు అసలు అనుమతులే లేవు.
పట్టించుకోని అధికారులు
పశుశాఖ, నగరపాలక సంస్థ అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ జరిపి మంచి మాంసాన్ని విక్రయించేలా చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా జీవాలను వధించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించాలి. కానీ ఇటువంటి పరీక్షలు జరగకుండానే మాంసాన్ని విక్రయిస్తున్నారు.
ఒక్కచోటే !
నగరంలోని పశువైద్యశాల ప్రాంగణంలో షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మటన్ మార్కెట్లోనే జీవాలకు వైద్య పరీక్షలు నిర్వహించి విక్రయిస్తున్నారు. వైద్యులు సైతం ఇటువంటి మాంసాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుంది
– ఇబ్రహీం, వ్యాపారస్తుడు
వెటర్నరీ వైద్యులు గతంలో పరీక్షలు నిర్వహించే వారు. ఇప్పుడు ఇటువైపుకు రావడం లేదు. మేము పరీక్షలు నిర్వహించమనే అడుగుతున్నాం. ఎవరు పట్టించుకోవడం లేదు.
ఏమైనా చెబితే కొట్టేందుకు వస్తారు
– శేషోజీరావు, మటన్ మార్కెట్ లీజుదారుడు
కబేళాలు ఎక్కడున్నాయ్. ఒక్కటీ లేదు. ఎటువంటి పరీక్షలు నిర్వహించరు. ఇష్టానుసారంగా గొర్రెలు, మేకలను కోసి అమ్ముతున్నారు. మునిసిపాలిటోళ్లు గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది. మేము చెప్పేందుకు వెళితే కొట్టేందుకొస్తారు.