Kadapa City
-
పోలీసుల భయంతో చెరువులో దూకిన యువకులు
సాక్షి, కడప: పోలీసుల భయంతో చెరువులో దూకిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప నగరంలో చోటుచేసుకుంది. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు వెంబడించడంతో ముగ్గురు యువకులు పుట్లంపల్లి చెరువులోకి దూకారు. దీంతో వారు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడిని వీరన్నగా గుర్తించారు. మిగతా ఇద్దరి కోసం ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు జరుపుతున్నారు. -
రసవత్తరంగా వెటరన్ క్రికెట్ పోటీలు
– సెమీస్‌లో సత్తాచాటిన హైదరాబాద్, విజయవాడ జట్లు – నేడు ఫైనల్ మ్యాచ్ కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రీడామైదానాల్లో నిర్వహిస్తున్న ఎం.చంద్రశేఖరరెడ్డి స్మారక వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. శనివారం ఉదయం లీగ్ మ్యాచ్‌లు నిర్వహించగా, మధ్యాహ్నం సెమీఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన హైదరాబాద్, విజయవాడ జట్లు ఆదివారం ఫైనల్మ్యాచ్లో తలపడనున్నాయి. కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో ఉదయం గుంటూరు, గోవా జట్ల మధ్య లీగ్ మ్యాచ్ నిర్వహించారు. టాస్ గెలిచిన గుంటూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా జట్టు 19 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో గుంటూరు జట్టు 8 వికెట్ల తేడాతో గోవా జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. కేఓఆర్ఎం క్రీడామైదానంలో.. కేఓఆర్ఎం క్రీడామైదానంలో ఉదయం నిర్వహించిన మరో లీగ్ మ్యాచ్‌లో అనంతపురం, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంత జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 14.4 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 132 పరుగుల విజయలక్ష్యం చేరుకుని ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. గుంటూరుపై హైదరాబాద్ విజయం.. కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో మధ్యాహ్నం నిర్వహించిన సెమీఫైనల్–1లో గుంటూరు, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గుంటూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 19 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. కడపపై విజయవాడ విజయం.. కేఓఆర్ఎం క్రీడామైదానంలో మధ్యాహ్నం నిర్వహించిన సెమీఫైనల్–2లో కడప, విజయవాడ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 19.5 ఓవర్లలో 185 పరుగులు చేసింది. జట్టులోని శ్రీకాంత్‌రెడ్డి 55, ఖాజామైనుద్దీన్ 50, వేణుగోపాల్ 30 పరుగులు చేశారు. విజయవాడ బౌలర్లు బాపిరాజు 4, శశిరెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విజయవాడ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని జనార్దన్ 83 నాటౌట్, లెనిన్ 51 పరుగులు నాటౌట్‌గా నిలిచారు. కడప బౌలర్లు భరత్ 1, జైనుల్లా 1 వికెట్ తీశారు. కడప జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విజయవాడ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. -
ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి
కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరం ముగింపును మార్చికే కుదించడం వలన విద్యార్థుల్లో, ఉపాధ్యాయులలో గందరగోళ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వేంపల్లి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. కడప నగరం ఎస్టీయూ భవన్లో ఆదివారం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో ఉపాధ్యాయ ఎన్నికలు, పదో తరగతి కార్యచరణ ప్రణాళిక అమలు, ఫ్రీపైనల్ పరీక్షలు , ఈ మధ్యనే పూర్తయిన సంగ్రాహణాత్మక-2 పరీక్షలు, వాటి బాహ్య మూల్యాంకనం నిర్వహించాల్సి ఉందన్నారు. వీటితోపాటు త్వరలో ఎఫ్ఏ -4 పరీక్షల నిర్వహణ ఉండగా సిలబస్ పూర్తికాలేదని ఇంతలో అన్ని పరీక్షలను మార్చి 20 నాటికి పూర్తి చేయాలంటే కష్టమన్నారు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మేధావులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షుడు రఘునాథరెడ్డిలు మాట్లాడుతూ కత్తి నరసింహారెడ్డిని గెలిపించి ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిలబెట్టాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరామయ్య, రాష్ట్ర నాయకులు రవీంద్రనాథరెడ్డి, వెంకటరమణ, ఆదిశేషారెడ్డి, జిల్లా నాయకులు సాంబశివారెడ్డి, పాలకొండయ్య, శ్రీనివాసులు, శంకరయ్య, శివారెడ్డి, గౌరీశంకర్, హైదర్‌వలి, దాదాపీర్, బద్వేల్ సునిత్ తదితరులు పాల్గొన్నారు. -
వాచీల దుకాణంలో భారీ చోరీ
– రూ. 14.88 లక్షల విలువైన 338 వాచీల అపహరణ కడప అర్బన్: కడప నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో రైల్వేస్టేషన్ రోడ్డులోని వరల్డ్ ఆఫ్ టైటాన్ వాచీల దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఈ సంఘటనపై సంస్థ మేనేజర్ ఎం.రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు దుకాణాన్ని మూసివేసి తర్వాత ఉదయం 9.30 గంటలకు తెరుస్తారు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి దుకాణాన్ని మూసి తిరిగి సోమవారం ఉదయం 9.30 గంటలకు తీసేసరికి లోపల వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. రూ.14.88 లక్షల విలువైన దాదాపు 338 వాచీలు అపహరణకు గురైనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. షట్టర్‌గానీ, తాళాలుగానీ పగులగొట్టకుండానే ఎంతో చాకచక్యంగా షట్టరును తీసి వాచ్‌లు దోపిడీకి పాల్పడినట్లు మేనేజర్ ఫిర్యాదు చేశారు. కడప వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ నాగరాజు, సీసీఎస్ పోలీసులు, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నకిలీ తాళం చెవిని ఉపయోగించి ఈ దోపిడీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా దుకాణంలోని సీసీ కెమెరాలు సమయానికి పనిచేయకపోవడం గమనార్హం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం, దర్యాప్తు బృందం వచ్చి ఆధారాలను సేకరించుకుని వెళ్లారు. -
వ్యక్తి ఆత్మహత్య
రామయ్య, భగత్‌సింగ్‌నగర్, కడప నగరం ఽకడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీసుస్టేషన్ పరిధి భగత్‌సింగ్‌నగర్‌లో నివసిస్తున్న రామయ్య (31) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామయ్య భార్య దేవకుమారికి ఇరువురు సంతానం ఉన్నారు. దేవకుమారి రిమ్స్‌లో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఏడు నెలలుగా రావాల్సిన వేతనంలో మూడు నెలల వేతనాన్ని రెండు రోజుల కిందట అందజేశారు. ఆ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆమె బయట సామాన్లు కడుగుతుండగా ఇంటిలో తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామయ్య అప్పుడప్పుడు మద్యానికి బానిసగా మారి భార్యతో గొడవ పడుతుండేవాడని, వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా రామయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాలూకా ఎస్ఐ–2 వెంకట రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అంతర్ జిల్లా ఫెన్సింగ్ పోటీలకు వైవీయూ క్రీడాకారులు
కడప స్పోర్ట్స్ : ప్రకాశం జిల్లా మార్టూరులో ఈనెల 22 నుంచి నిర్వహించే అంతర్ జిల్లా ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు వైవీయూ ఎంపీఈడీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 18వ తేదీన రాయచోటిలో నిర్వహించిన ఫెన్సింగ్ జిల్లా స్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపికచేశారు. వైవీయూలో ఎంపీఈడీ చదువుతున్న బి. వెంకటేష్, కె. సురేష్, తిరుమలయ్య, నరేంద్ర, కె. విశ్వనాథ్, నాగరాజు, బి.మల్లికార్జున, ఆర్.ప్రసాద్ అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. వీరిని వైవీయూ క్రీడాబోర్డు కార్యదర్శి డా. కె.రామప్రసాద్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో వ్యాయామవిద్య విభాగం అకడమిక్ కన్సల్టెంట్ డా. టి.వి.బి.కృష్ణారెడ్డి, సాయికృష్ణ పాల్గొన్నారు. -
మేధస్సుతో ఆడే క్రీడ చదరంగం
కడప స్పోర్ట్స్: మేధస్సుతో ఆడే క్రీడ చదరంగం అని నగరపాలకోన్నత పాఠశాల (మెయిన్) ప్రధానోపాధ్యాయుడు పి.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప నగరంలోని నగరపాలకోన్నత పాఠశాల (మెయిన్)లో జిల్లాస్థాయి ప్రభుత్వ పాఠశాలల చదరంగ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం క్రీడలో చాలామంది తెలుగు క్రీడాకారులు రాణిస్తున్నారని, హంపి, హరికృష్ణ, హారిక లాంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్బారీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే క్రీడాకారులకు మాత్రమే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల నుంచి ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలను ఎంపికచేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారు ఈనెల 18, 19 తేదీల్లో విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి, చీఫ్ ఆర్బిటర్ బాలాజీ, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, సునీత పాల్గొన్నారు. -
కొనసాగుతున్నగాలింపు చర్యలు
సిద్దవటం : సిద్దవటం పెన్నానదిలో కొట్టుకుపోయి యువకుని కోసం పోలీసులు, ఈతగా ళ్లు సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. కడప నగరం ఇందిరానగర్‌కు చెందిన ఎనమ ల రామాంజనేయులు (22) అనే యువకుడు ఆదివారం మçధ్యాహ్నం సిద్దవటంలోని లోలెవెల్ కాజ్వే వద్దకు వచ్చి నీటిలో ఈత కొ డుతూ పెన్నాలో గల్లంతైన విషయం తెలిసిం దే. ఆదివారం రాత్రి, సోమవారం పెన్నానీటిలో ఇరువైపులా గాలింపు చర్యలు చేపడు తూ వెలుగుపల్లె గ్రామం దాటుకుని పెన్నానదిలో వెతికామని ఎస్ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. తర్వాత ఎక్కడైనా ఇరుక్కుని ఉంటాడనే ఉద్దేశంతో బోటులో వెళ్లి కూడా గాలింపు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. -
నేత్రపర్వం
కడప కల్చరల్ : భూదేవి ప్రమిదగా శివుడే ఆత్మజ్యోతిగా ఆ ప్రాంగణం వెలుగులతో కళకళలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కడప మున్సిపల్ మైదానంలో ఎనిమిది రోజులుగా జరిగిన కార్తీక దీపోత్సవం సోమవారం వైభవంగా, నేత్రపర్వంగా ముగిసింది. కడప చిన్మయ మిషన్ గురువులు స్వామి శౌనక చైతన్య ఆధ్వర్యంలో తొలుత చిన్మయమిషన్ స్వామిజీలు కార్తీకమాసం, దీపం విశిష్టతల గురించి వివరించారు. అనంతరం శివునికి అభిషేకాలు, అలంకరణ నిర్వహించి భారీగా ఏర్పాటు చేసిన కార్తీక జ్వాల తోరణాలను వెలిగించారు. నిర్వాహకులు ఎలిశెట్టి శివకుమార్, ముల్లంగి ప్రసాద్, చింతకుంట పుల్లయ్య, మాకం ఆనంద్, నాగరాజులు కుటుంబాలు, స్వామిజీలు శివనామ స్మరణల మధ్య వేదికపై ప్రధాన జ్యోతిని వెలిగించారు. ఆకాశంలో నిండు పున్నమి చంద్రుని సాక్షిగా ఆ ప్రాంగణంలో దాదాపు ఆరు వేల మంది భక్తులు ఒక్కసారిగా కార్తీక దీపాలను వెలిగించి ఆ చంద్రశేఖరుని సాక్షిగా ఆ ప్రాంతాన్ని తేజోమయం చేశారు. ఎనిమిది రోజులపాటు ఈ భారీ కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించినందుకు నిర్వాహకులను ప్రజలు అభినందించారు. సహకరించిన ప్రజలందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
–మృతురాలు కడప వాసి –హెచ్‌పీసీఎల్ సమీపంలో మృతదేహం –సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు –నిందితుడు పాత నేర స్తుడే...! సిద్దవటం: వివాహేతర సంబంధం ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ సంఘటన నెల రోజుల తరువాత ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతానికి చెందిన రాంపల్లె ఆంజనేయులు కడప నగరం ప్రకాష్‌నగర్‌లో నాలుగేళ్ల నుంచి నివాసముంటున్నాడు. ఇక్కడి మినరల్ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తూ ఇంటింటికి వాటర్ క్యాన్లు సరఫరా చేసేవాడు. అలా క్యాన్లు సరఫరా చేసే క్రమంలో కడప నగరం వివేకానంద నగర్‌కు చెందిన ఆల అన్నపూర్ణతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆరు నెలల పాటు ఈ వ్యవహారం కొనసాగిన నేపథ్యంలో ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానం ఆంజనేయులుకు వచ్చింది. ఈ విషయమై ఆమెను పలుమార్లు అడిగినా అతను తమ బంధువు అని చెబుతూ వచ్చింది. అయితే అన్నపూర్ణను ఎలాగైనా సరే హతమార్చాలని నిర్ణయించుకున్న ఆంజనేయులు ఆమెకు మాయమాటలు చెప్పి గత నెల 28వ తేదీన సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని హెచ్‌పీసీఎల్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో మాట్లాడుతూనే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అన్నపూర్ణ భర్త ఆల శ్రీనివాసులు తన భార్య కనిపించలేదని బంధువుల గ్రామాలలో వెతికి చివరకు ఈనెల 14వ తేదీన కడప మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పలువురిని విచారిస్తుండగా ఆంజనేయులు గమనించి తనను కూడా విచారిస్తారనే భయంతో సోమవారం సిద్దవటం మండలం పెద్దపల్లె వీఆర్ఓ శేషారెడ్డి వద్ద లొంగిపోయాడని ఒంటిమిట్ట ఇన్చార్జి సిఐ హేమసుందర్రావు తెలిపారు. శేషారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆంజనేయులును అదుపులోకి తీసుకొని మహిళను హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. అక్కడున్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ అరుణ్‌రెడ్డి,రాజంపేట డీఎస్పీ రాజేంద్ర కూడా పరిశీలించారు. కడప రిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుడు ఆనంద్ మహిళ మృతదేహానికి సంఘటన స్థలంలోనే పోస్టు మార్టం నిర్వహించారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు. నిందితుడికి మరో కేసుతో సంబంధం అన్నపూర్ణ అనే మహిళను హత్య చేసిన నిందితుడు ఆంజనేయులు 2012లో మహబూబ్ నగర్ జిల్లా వీనుగండ్ల పోలీసు స్టేషన్ పరిధిలో గాయత్రి అనే మహిళను ఉరివేసి చంపినట్లు పోలీసు స్టేషన్లో కేసు నమోదైందని సీఐ హేమసుందర్రావు తెలిపారు. అతను ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాడన్నారు. -
అనుమానమే పెనుభూతమై..
- భార్యను కడతేర్చిన భర్త చింతకొమ్మదిన్నె : కడప నగర శివార్లలోని కొప్పర్తి సమీపంలో ఉన్న హరీంద్రనగర్‌లో ఆదివారం ఉదయం ఐదు నెలల గర్భిణిని ఆమె భర్త దారుణంగా హతమార్చాడు. అనుమానమే ఈ ఘటనకు ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే....గత నాలుగు సంవత్సరాల క్రితం పెండ్లిమర్రి మండలం దర్బారుపేటకు చెందిన అమీరున్ను హరీంద్రనగర్‌కు చెందిన షేక్ అబ్దుల్లా వివాహమాడాడు. వీరికి మూడు సంవత్సరాల చిన్నారి సమీర ఉంది. ప్రస్తుతం అమీరున్ ఐదు నెలల గర్భిణి. గత కొద్ది నెలల నుంచి ఇరువురి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఏర్పడ్డాయి. అమీరున్‌పై భర్త అబ్దుల్లాకు అనుమానం మొదలైంది. ఆదివారం తెల్లవారుజామున 6.30–7.00 గంటల మధ్య అమీరున్ ఇంటి వద్ద వంట సామగ్రిని శుభ్రం చేస్తుండగా వెనుక వైపు నుంచి అబ్దుల్లా రోకలిబడెతో తలపై రెండు మార్లు మోదడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, రూరల్ సీఐ వెంకట శివారెడ్డి, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎస్ఐ కుళ్లాయప్ప సంఘటనానికి చేరుకున్నారు. నిందితుడి గురించి గ్రామంలో విచారించారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. నిందితుడు పరారీలో ఉండగా గాలింపులు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కుళ్లాయప్ప తెలియజేశారు. -
అక్టోబర్ 2న జాబ్‌మేళా
కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని శ్రీ సరస్వతి డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 2న ఎంజీఐ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్లు లోకనాథస్వరూప్, గురుప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌మేళాకు 12 కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. పీజీ చేసిన విద్యార్థులు కూడా హాజరుకావొచ్చని, వివరాలకు 9885850638 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
జడివాన
-
బైక్‌ను ఢీకొట్టిన కారు : ఇద్దరు మృతి
కడప: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన కడప శివారులో ఆదివారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కడపలో భారీ వర్షం
కడప : గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కడప నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్కే నగర్, ఏఎస్ఆర్ నగర్, బుడగజంగాల కాలనీ, మృత్యుంజయ కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సదరు ప్రాంతాల్లో ఇళన్నీ నీట మునిగాయి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ అధికారులు మాత్రం కనీసం పరామర్శించిన పాపాన పోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వైఖరికి నిరసనగా వర్షపు నీటిలో కాలనీ వాసులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. -
చినుకు పాట్లు
-
కడపలో గంటా ఆకస్మిక పర్యటన
కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఆకస్మిక పర్యటన చేశారు. నగరంలోని రవీంద్రనగర్, పాతబస్టాండ్, ఐటీఐ సర్కిల్ ప్రాంతాల్లో దాదాపు గంటపాటు తిరిగి ఆయన పారిశుధ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ పనితీరు బాగోలేదని చెప్పడంతో స్పందించిన మంత్రి... అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. సోమవారం సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో ఆయన ఈమేరకు ఆకస్మిక పర్యటన నిర్వహించారు. -
పోలీసులు వేధింపులు : యువకులు ఆత్మహత్యాయత్నం
వైఎస్సార్ : ఎవరైన వేధిస్తే... సదరు బాధితులు పోలీసుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకంటారు. మరి అలాంటిది.. పోలీసులే వేధిస్తే.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కడప టూటౌన్‌పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక సాయిపేటకు చెందిన సురేష్ (27), శ్రీనివాస్ (28)లు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం సురేష్, శ్రీనివాస్‌ల ఇంటికి పోలీసులు వెళ్లి మీరు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు... మా వద్ద పక్కా సమాచారం ఉందని బెదిరించారు. మీ మీద కేసు నమోదు చేయకుండా ఉండాలంటే మా ఉన్నతాధికారులతో బేరసారాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇద్దరు యువకులు తమకు బెట్టింగ్‌కు ఎలాంటి సంబంధంలేదని మొరపెట్టుకున్నారు. దాంతో పోలీసులు వెళ్లి పోయారు. మళ్లీ సాయంత్రం వాళ్ల ఇంటి వద్దకు వచ్చి పోలీసులు ఇదే తీరుగా వ్యవహారించడంతో వారిద్దరు తీవ్ర మనస్తాపం చెందారు. దాంతో సదరు యువకులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసుల ఆగడాలపై స్థానికులు మండిపడుతున్నారు. -
బాలుడి కిడ్నాప్.. సుఖాంతం
కడప అర్బన్ : కడప నగరంలో మంగళవారం ఉదయం కిడ్నాప్‌నకు గురైన నిమ్మకంటి మల్లికార్జున కుమారుడు యశ్వంత్ (6) ఎట్టకేలకు తల్లిదండ్రుల ఒడికి చేరాడు. జిల్లా ఎస్పీ డా.నవీన్ గులాఠి.. బాలుడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. కడప కార్పొరేషన్లో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నిమ్మకంటి మల్లికార్జున, శ్రీవాణి దంపతులకు యశ్వంత్ (6), లక్ష్మి ప్రణీత (3)లు సంతానం. వారు మున్సిపల్ స్టేడియంలోని దత్తసాయి మందిర్ పక్కనున్న ఇంటిలో ఉంటున్నారు. ప్రతిరోజు యశ్వంత్ బయట ఆడుకునే వాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. 9 గంటలప్పుడు గమనించగా బాలుడు ఎక్కడా కన్పించలేదు.అంతలో వీరి ఇంటిపక్కనుండే డ్రైవర్ పుల్లయ్య సెల్‌ఫోన్(98664 46732)కు అపరిచిత వ్యక్తి (సెల్ 9908348947) ఫోన్ చేశాడు. యశ్వంత్ అనే పిల్లాడిని రాజంపేట వైపు తీసుకువెళుతున్నామని చెప్పాడు. ఆలోపే మల్లికార్జున పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండటంతో ఓ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి వచ్చాడు. డ్రైవర్ పుల్లయ్య, మల్లికార్జునతో అపరిచిత వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడించారు. కానిస్టేబుల్ మాట్లాడే ప్రయత్నం చేయగా అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో తీవ్ర ఆవేదనతో యశ్వంత్ తల్లిదండ్రులు విలపించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ సూచనల మేరకు కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, అర్బన్ సీఐ సదాశివయ్య దర్యాప్తు ముమ్మరం చేశారు. పిల్లాడి ఫొటోలను వాట్సాప్‌లో అన్ని పోలీస్స్టేషన్లకు పంపించారు. ఈ నేపథ్యంలో తమను పోలీసులు వెంటాడుతున్నారని భావించిన కిడ్నాపర్లు బాలుడిని సాయంత్రం రాయచోటి బస్టాండు వద్ద వదిలి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత బాలుడిని గుర్తించిన రాయచోటి పోలీసులు కడపకు తీసుకువచ్చారు. ఎస్పీ ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పారు. -
కడపలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్
కడప: కడప నగరంలో బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అపహరించారు. కడప నగరానికి చెందిన మల్లికార్జున్అనే వ్యక్తి కడప కార్పోరేషన్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి యశ్వంత్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ రోజు ఉదయం ఇంటి ఎదుటు యశ్వంత్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు యశ్వంత్‌ను అపహరించారు. అనంతరం బాలుడు తండ్రి మల్లికార్జున్‌కు దుండగులు ఫోన్ చేసి యశ్వంత్‌ను అపహరించినట్లు చెప్పి.. ఫోన్ పెట్టాశారు. దీంతో యశ్వంత్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతూ.... పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేట్ బస్సుల్లో చెలరేగిన మంటలు
కడప: కడప నగరంలోని గ్రూప్ థియేటర్ సమీపంలో శనివారం ఉదయం ఆగి ఉన్న రెండు ప్రైవేట్ బస్సుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంచాయతీ పరీక్ష ప్రశాంతం
- 65.45శాతం హాజరు కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీ కార్యదర్శులు (గ్రేడ్-4) పరీక్షలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలుండగా 17,513 మంది అభ్యర్థులకుగానూ 11,463 మంది (65.45శాతం) హాజరయ్యారు. కడప నగరంలోని 19 కేంద్రాల్లో 8,450మందికి గానూ 5,804(68.68శాతం) మంది, రాజంపేటలో 11 కేంద్రాల్లో 6063 మందికిగానూ 3717 మంది(61.03శాతం), ప్రొద్దుటూరులో 6 కేంద్రాల్లో 3వేల మంది అభ్యర్థులకుగానూ 1942 మంది(64.73శాతం) హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ ఎం.రామారావు, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి తదితరులు పరీక్షలను పర్యవేక్షించారు. -
అంగన్ వాడీల వినూత్న నిరసన
అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం కడప నగరంలో ఖాళీ అన్నం గిన్నెలను తలపై పెట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి పాతబస్టాండు, ఏడురోడ్ల కూడలి మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజకుళాయమ్మ, శంకరమ్మ మాట్లాడుతూ కనీస వేతనంగా రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అర్బన్ విభాగం అధ్యక్షురాలు అంజనీదేవి, ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, రూరల్ నాయకులు కృష్ణవేణి, పద్మావతి, సావిత్రి పాల్గొన్నారు. - న్యూస్‌లైన్ , కడప కలెక్టరేట్