ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
–మృతురాలు కడప వాసి
–హెచ్‌పీసీఎల్ సమీపంలో మృతదేహం
–సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
–నిందితుడు పాత నేర స్తుడే...!
సిద్దవటం: వివాహేతర సంబంధం ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ సంఘటన నెల రోజుల తరువాత ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతానికి చెందిన రాంపల్లె ఆంజనేయులు కడప నగరం ప్రకాష్‌నగర్‌లో నాలుగేళ్ల నుంచి నివాసముంటున్నాడు. ఇక్కడి మినరల్ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తూ ఇంటింటికి వాటర్ క్యాన్‌లు సరఫరా చేసేవాడు. అలా క్యాన్‌లు సరఫరా చేసే క్రమంలో కడప నగరం వివేకానంద నగర్‌కు చెందిన ఆల అన్నపూర్ణతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆరు నెలల పాటు ఈ వ్యవహారం కొనసాగిన నేపథ్యంలో ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానం ఆంజనేయులుకు వచ్చింది. ఈ విషయమై ఆమెను పలుమార్లు అడిగినా అతను తమ బంధువు అని చెబుతూ వచ్చింది. అయితే అన్నపూర్ణను ఎలాగైనా సరే హతమార్చాలని నిర్ణయించుకున్న ఆంజనేయులు ఆమెకు మాయమాటలు చెప్పి గత నెల 28వ తేదీన సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని హెచ్‌పీసీఎల్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో మాట్లాడుతూనే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అన్నపూర్ణ భర్త ఆల శ్రీనివాసులు తన భార్య కనిపించలేదని బంధువుల గ్రామాలలో వెతికి చివరకు ఈనెల 14వ తేదీన కడప మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పలువురిని విచారిస్తుండగా ఆంజనేయులు గమనించి తనను కూడా విచారిస్తారనే భయంతో సోమవారం సిద్దవటం మండలం పెద్దపల్లె వీఆర్‌ఓ శేషారెడ్డి వద్ద లొంగిపోయాడని ఒంటిమిట్ట ఇన్‌చార్జి సిఐ హేమసుందర్‌రావు తెలిపారు. శేషారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆంజనేయులును అదుపులోకి తీసుకొని మహిళను హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. అక్కడున్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి,రాజంపేట డీఎస్పీ రాజేంద్ర కూడా పరిశీలించారు. కడప రిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుడు ఆనంద్ మహిళ మృతదేహానికి సంఘటన స్థలంలోనే పోస్టు మార్టం నిర్వహించారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు.
నిందితుడికి మరో కేసుతో సంబంధం
అన్నపూర్ణ అనే మహిళను హత్య చేసిన నిందితుడు ఆంజనేయులు 2012లో మహబూబ్ నగర్ జిల్లా వీనుగండ్ల పోలీసు స్టేషన్ పరిధిలో గాయత్రి అనే మహిళను ఉరివేసి చంపినట్లు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందని సీఐ హేమసుందర్‌రావు తెలిపారు. అతను ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాడన్నారు.