వాచీల దుకాణంలో భారీ చోరీ
– రూ. 14.88 లక్షల విలువైన 338 వాచీల అపహరణ
కడప అర్బన్: కడప నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో రైల్వేస్టేషన్ రోడ్డులోని వరల్డ్ ఆఫ్ టైటాన్ వాచీల దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఈ సంఘటనపై సంస్థ మేనేజర్ ఎం.రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు దుకాణాన్ని మూసివేసి తర్వాత ఉదయం 9.30 గంటలకు తెరుస్తారు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి దుకాణాన్ని మూసి తిరిగి సోమవారం ఉదయం 9.30 గంటలకు తీసేసరికి లోపల వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. రూ.14.88 లక్షల విలువైన దాదాపు 338 వాచీలు అపహరణకు గురైనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. షట్టర్‌గానీ, తాళాలుగానీ పగులగొట్టకుండానే ఎంతో చాకచక్యంగా షట్టరును తీసి వాచ్‌లు దోపిడీకి పాల్పడినట్లు మేనేజర్ ఫిర్యాదు చేశారు. కడప వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ నాగరాజు, సీసీఎస్ పోలీసులు, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నకిలీ తాళం చెవిని ఉపయోగించి ఈ దోపిడీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా దుకాణంలోని సీసీ కెమెరాలు సమయానికి పనిచేయకపోవడం గమనార్హం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ తెలిపారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం, దర్యాప్తు బృందం వచ్చి ఆధారాలను సేకరించుకుని వెళ్లారు.