నేత్రపర్వం
కడప కల్చరల్ : భూదేవి ప్రమిదగా శివుడే ఆత్మజ్యోతిగా ఆ ప్రాంగణం వెలుగులతో కళకళలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కడప మున్సిపల్ మైదానంలో ఎనిమిది రోజులుగా జరిగిన కార్తీక దీపోత్సవం సోమవారం వైభవంగా, నేత్రపర్వంగా ముగిసింది. కడప చిన్మయ మిషన్ గురువులు స్వామి శౌనక చైతన్య ఆధ్వర్యంలో తొలుత చిన్మయమిషన్ స్వామిజీలు కార్తీకమాసం, దీపం విశిష్టతల గురించి వివరించారు. అనంతరం శివునికి అభిషేకాలు, అలంకరణ నిర్వహించి భారీగా ఏర్పాటు చేసిన కార్తీక జ్వాల తోరణాలను వెలిగించారు. నిర్వాహకులు ఎలిశెట్టి శివకుమార్, ముల్లంగి ప్రసాద్, చింతకుంట పుల్లయ్య, మాకం ఆనంద్, నాగరాజులు కుటుంబాలు, స్వామిజీలు శివనామ స్మరణల మధ్య వేదికపై ప్రధాన జ్యోతిని వెలిగించారు. ఆకాశంలో నిండు పున్నమి చంద్రుని సాక్షిగా ఆ ప్రాంగణంలో దాదాపు ఆరు వేల మంది భక్తులు ఒక్కసారిగా కార్తీక దీపాలను వెలిగించి ఆ చంద్రశేఖరుని సాక్షిగా ఆ ప్రాంతాన్ని తేజోమయం చేశారు. ఎనిమిది రోజులపాటు ఈ భారీ కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించినందుకు నిర్వాహకులను ప్రజలు అభినందించారు. సహకరించిన ప్రజలందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.