అరగంటలో నాలుగు దొంగతనాలు
అది మచిలీపట్నంలోని కలెక్టర్ బంగళా వెనుక రోడ్డు.. మంగళవారం తెల్లవారుజాము సమయం.. సీఎస్ఆర్ నగర్‌కు చెందిన లక్ష్మీరత్నకుమారి వాకింగ్ చేస్తున్నారు.. ఇంతలో మోటార్ సైకిల్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకునే ప్రయత్నం చేశారు.. ప్రతిఘటించిన ఆమెను రోడ్డుపై పడేసి గొలుసు లాక్కుపోయారు.. ఇంగ్లిషుపాలెంలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మరో మహిళ వద్ద.. ఈడేపల్లిలో, బైపాస్ రోడ్డులోని మాచవరంలో మరో ఇద్దరి వద్ద.. ఇదే తరహాలో గొలుసు చోరీలు చేశారు. ఒకేరోజు అరగంట వ్యవధిలో వరుసగా చోరీలు జరగడం పట్టణంలో సంచలనం రేపింది. ఈ ఘటనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు చోట్ల వరుస గొలుసు దొంగతనాల ఘటనలు జరిగాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
వాకింగ్ చేస్తుండగా వాహనంపై వచ్చి ...
పట్టణంలోని సీఎస్ఆర్ నగర్‌కు చెందిన క్రోవి లక్ష్మీరత్నకుమారి కలెక్టర్ బంగ్లా వెనుకరోడ్డులో మంగళవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా మోటార్‌సైకిల్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 26 గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. ఆమె ప్రతిఘటించటంతో రోడ్డుపై పడేసి మెడలోని గొలుసును లాక్కుపోయారు.
అడ్రస్‌లు అడిగి.. ఆదమరిపించి..
ఇంగ్లిషుపాలెంకు చెందిన మాదిరెడ్డి ఉమాసుందరి తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న నాలుగు కాసుల (32 గ్రాములు) గొలుసును తెంచుకుని పోయారు. అనంతరం ఈడేపల్లికి చెందిన వేముల భారతరాజేశ్వరి ఇంటిముందు ముగ్గు వేస్తుండగా బైక్‌పై ఇద్దరు దుండగులు వచ్చారు. వారిలో ఒకడు తనవద్ద ఉన్న చిన్న కాగితం చూపి ఫలానా పేరున్న వ్యక్తి ఇల్లు ఇదేనా? అని అడిగాడు. ఆ పేరుగలవారు ఇక్కడ ఎవరూ లేరనే సమాధానం ఇచ్చే లోపుగానే రాజేశ్వరి మెడలో ఉన్న మూడు సవర్ల (24గ్రాములు) బంగారు గొలుసును లాక్కుపోయారు.
బైపాస్ రోడ్డులోని మాచవరంలో ఉంటు న్న కాగిత సూరమ్మ అనే వృద్ధురాలు ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఇద్దరు దుండగులు వచ్చారు. వారిలో ఒకడు ఆమె వద్దకు వచ్చి ఒకరి అడ్రస్‌ను హిందీలో అడిగాడు. తనకు హిందీ రాదని.. భర్తను పిలుస్తానంటూ ఇంట్లోకి వెళ్లబోతున్న సూరమ్మపై దాడి చేశాడు. ఆమె మెడలోని ఆరు సవర్ల (48గ్రాములు) రెండు పేటల నానుతాడును మంగళసూత్రాలతో సహా తెంచుకున్నాడు. వెంటనే ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ నాలుగు ఘటనల్లో ఇద్దరు యువకులు పాల్గొన్నారు. వారిలో ఒకడు గొలుసులు తెంచుకుని సమీపంలో ఉన్న బైక్‌పైకి ఎక్కాడు. దానిపై అప్పటికే సిద్ధంగా ఉన్న మరో యువకుడితో కలిసి రెప్పపాటులో మాయమయ్యారని బాధితులు చెబుతున్నారు.
పోలీసు బృందాల గాలింపు
పట్టణంలో గత జూన్ 16వ తేదీ తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో ఇదే తరహాలో వరుస చోరీలు జరిగాయి. అప్పట్లో పలువురు మహిళల నుంచి సుమారు 109 గ్రాముల విలువ చేసే బంగారు ఆభరణాలను ఇద్దరు యువకులు సినీ ఫక్కీలో అపహరించుకుపోయారు. అదే ముఠా మళ్లీ ఈ చోరీలకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. ఈ బృందాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
బాధితుల నుంచి వివరాలు సేకరించిన డీఎస్పీ
చైన్‌స్నాచింగ్‌ల వరుస ఘటనలు పట్టణ ప్రజల్లో కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న పలువురు వాకింగ్‌ను మానివేసి హుటాహుటిన ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనలపై సమాచారం అందుకున్న డీఎస్పీ కె.వి.శ్రీనివాసరావు హుటాహుటిన బాధితుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. నేరస్తులకు సంబంధించి బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు.
అయితే దుండగులు ఒక్కసారిగా గొలుసులు తెంచుకుపోతుండటంతో ఆందోళనకు గురై వారిని సరిగా పసిగట్టలేకపోయామని బాధితులు తెలిపారు. దీంతో ఆయన పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో పుటేజీలను పరిశీలించి, నిందితుల ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నించారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో రెండు పోలీసు ప్రత్యేక బృందాలనుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాగా ఈ చోరీలన్నీ చిలకలపూడి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగాయి. బాధితులంతా అదే స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.