కొత్తగా ‘కాకతీయ’
తెరపైకి వరంగల్ రూరల్ జిల్లా
14 మండలాలతో ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు
నగరం మొత్తం ఒకే జిల్లాలో..
వరంగల్ జిల్లాలో భారీ మార్పులు
తాజా ప్రతిపాదన ప్రకారం...
వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్, హన్మకొండ, కాజీపేట, హసన్‌పర్తి, ధర్మసాగర్, చిల్పూరు, వేలేరు, స్టేషన్ ఘన్పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, జమ్మికుంట, ఇల్లంతకుంట.
కాకతీయ జిల్లా : వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, పరకాల, శాయంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి.
సాక్షిప్రతినిధి, వరంగల్ :
జిల్లాల పునర్విభజన కొత్త మలుపు తిరుగుతోంది. వరంగల్ నగరం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలని పలు వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్ జిల్లాను... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా ఏర్పాటు చేసేలా ముసాయిదాలో పేర్కొంది. గ్రేటర్ వరంగల్ నగరాన్ని వరంగల్, హన్మకొండ జిల్లాల్లో సగం చొప్పున కేటాయిస్తూ ముసాయిదాలో పొందుపరిచారు. దీనిపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత మొదలైంది. వరంగల్ నగరాన్ని రెండు జిల్లాల్లో ఉంచే ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. గ్రేటర్ వరంగల్ నగరాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చేలా కొత్తగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొన్న హన్మకొండ జిల్లాలో గ్రేటర్ వరంగల్‌లోని తూర్పు నియోజకవర్గాన్ని చేర్చి.. వరంగల్ జిల్లాగా మార్చాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ముసాయిదా జాబితాలో వరంగల్ జిల్లాగా పేర్కొన్న దానికి కొత్తగా కాకతీయ జిల్లాగా నామకరణం చేసే ఆలోచనలో ఉన్నారు. ముసాయిదాలో పేర్కొన్న ప్రతిపాదనలపైనే విమర్శలు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేస్తున్న ప్రతిపాదనల తీరు మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. హన్మకొండ జిల్లాను పూర్తిగా తొలగించేందుకే కొత్తగా వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆగస్టు 22న జారీ చేసిన ముసాయిదా ప్రకారం...
వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుకొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ.
హన్మకొండ జిల్లా : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట(కొత్తది).