కాపు కార్పొరేషన్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామనుజయ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూముల వేలం పాటకు తన కుమారుడు, అతని వ్యాపార భాగస్వాములు వెళ్లారని, ఈ వ్యవహారంలో వివరాలు తెలియక ఇరుక్కుపోయామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. సత్రం భూములన్నీ అన్యాక్రాంతం అయ్యాయని, పైగా కోర్టు వివాదాలు ఉన్నాయన్నారు. వేలంపాటలో నిబంధనల మేరకే భూములు కొనుగోలు చేసినట్లు రామనుజయ తెలిపారు. అయితే ఎకరా రూ.6.5 కోట్లు విలువ చేస్తుందని, ఎండోమెంట్ అధికారి తేల్చిన విషయం తెలియదా అన్న మీడియా ప్రశ్నకు రామనుజయ సమాధానం దాటవేశారు.
కాగా గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నై నగర సమీపంలోని 83.11 ఎకరాల విక్రయంలోని లోపభూయిష్ట విధానాలను, దేవాదాయ శాఖలో సంబంధిత ఫైలు కదిలిన వైనాన్ని ‘సాక్షి’ సాక్ష్యాలతో సహా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సదావర్తి సత్రం భూములు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులు ముగ్గురికి, వీరితో పాటు మరో ఐదుగురికి తక్కువ ధరకు వేలంలో దక్కాయని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ భూముల వేలంపై ప్రభుత్వం జారీ చేసిన మెమోను రద్దు చేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.