చుక్కనీరు కరువాయె!
తాడిమర్రి : వేసవి ప్రారంభమైంది.. గ్రామాల్లో గుక్కెడు నీరు దొరకడం గగనమైంది.. భూగర్భలాలు అడుగంటిపోయాయి. బోరుబావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. పొలాలన్నీ బీళ్లుగా మారాయి. చుక్కనీరైనా దొరక్కపోదా? అని మూగజీవాలు నోరెళ్లబెడుతున్నాయి. మూగజీవాలకు తాపేందుకు అడవిలో చుక్కనీరు దొరక్క పశువులు, గొర్రెల కాపరులు అవస్థలు పడుతున్నారు.
అయితే గత ఏడేళ్లుగా వర్షాలు సక్రమంగా కురువక పోవడంతో వంకలు, చెరువుల్లో చుక్కనీరు కనిపించలేదు. దీంతో గొర్రెలను మేపడానికి వెళ్లి కాపరులు మధ్యాహ్నానికే ఇళ్లు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి చెరువులు, వంకల్లో బోర్లు వేసి, తాగునీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని గొర్రెల కాపరులు కోరుతున్నారు. మండలంలో ఏడేళ్లుగా సక్రమంగా వర్షాలు కురవలేదు. పంటలు పండక రైతులు నష్టపోయ్యారు. చాలా మంది రైతులు ప్రత్యామ్నాయంగా గొర్రెల పెంపకం వైపు మళ్లారు. అంతేకాక దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఐకేపీ సంఘాల్లోని మహిళలకు పావలావడ్డీ రుణాలు అధికంగా ఇచ్చారు. దీంతో అటు రైతులు, ఇటు మహిళలు గొర్రెల పెంపకం చేపట్టారు.