బెజవాడలో కిడ్స్‌పార్క్
వీజీటీఎం ఉడా బాలవాటిక
మూడెకరాల్లో నిర్మించేలా ప్రతిపాదనలు
రూ.5కోట్ల నిర్మాణ వ్యయం
కేంద్ర నిధుల కోసం యత్నం
సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గడచిన రెండు నెలల కాలవ్యవధిలో రూ.1400 కోట్ల భారీ ప్రతిపాదనల్ని తయారు చేశారు. వీజీటీఎం పరిధిలో లింకు రోడ్ల కనెక్టివిటి మొదలుకొని ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ సొసైటీ వరకు పలు ప్రతిపాదనల్ని ఇప్పటికే సిద్ధం చేశారు. దీనిలో భాగంగా బాలవాటిక పేరుతో కిడ్స్ జోన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అనువైన భూమిని మాత్రం ఇంతవరకు గుర్తించలేదు.
మరోవైపు దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేశారు. ఉడా అధికారులు విజయవాడ శివారు ప్రాంతంలోని ఉడా పరిధిలో మూడెకరాల విస్తీర్ణంలో బాలవాటికను నిర్మించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రూ.5కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు విషయం కొంత కష్టంగా మారడంతో కేంద్రప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దీనిని నిర్మించాలని యోచిస్తున్నారు.
ఇప్పటికే ప్రతిపాదనల వివరాలను రాష్ట్ర పురపాలక శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపారు. బాలవాటిక పేరుతో పూర్తి స్థాయిలో కిడ్స్ సిటీని నిర్మించ నున్నారు. చిన్నారులకు ఆహ్లాదం కలిగించేలా వివిధ గేమ్స్ జోన్లు, పార్కులు, చిన్నారుల వయస్సుల వారీగా పార్కులు, స్విమ్మింగ్ పూల్, ఇతర క్రీడా పరికరాలను కిడ్స్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. అయితే విజయవాడ, పరిసర ప్రాంతాల్లో భూమి కొరత అధికంగా ఉంది.
ఈ క్రమంలో నగర శివారులో ఎదైనా ప్రభుత్వ భూమిని పొందాలనే యోచనలో ఉడా ఉంది. ఇప్పటికే ఉడా అధికారులు రెవెన్యూ అధికారులను భూమి కోసం సంప్రదించారు. తాత్కాలిక రాజధాని హడావుడి వల్ల ప్రస్తుతానికి పెండింగ్ పడింది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఉడా ప్రాజెక్టులకు నిధులొస్తే వెంటనే ప్రాజెక్టు కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇంటిగ్రేటెడ్ షౌపింగ్ వెంచర్ ప్రతిపాదిత స్థలంలో మూడెకరాలు దీనికి కేటాయిస్తే భూమికి ఇబ్బంది ఉండదని అధికారుల భావన. అయితే అటవీ భూములు ఉడాకు కేటాయించాలంటే చాలా సమయం పడుతుంది.
జక్కంపూడిలో జేఎన్ఎన్యూఆర్ఎం నివాసాల సముదాయంలో ఉన్న ఖాళీ భూమిలో కిడ్స్‌సిటీ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఉడా అధికారులు ప్రాజెక్టు నిధుల మంజూరు కోసం రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలను కలవనున్నారు. మరోవైపు ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులను కలవనున్నట్లు తెలుస్తోంది.
గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును ఉడా చైర్మన్ కలిసి ప్రతిపాదనలు అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించడంతో సమగ్రంగా ప్రాజెక్టును సిద్ధం చేసుకుని త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఇంకోవైపు తాత్కాలిక రాజధాని నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఉడాకు నిధులు మంజూరు చేయాలనే డిమాండ్ కొనసాగుతోంది. మొత్తం మీద ప్రభుత్వ అంగీకారం లభిస్తే కిడ్స్ పార్క్ వెంటనే కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది.