కిలారికి గ్రంథాలయ కుర్చీ
లోకేష్, నారాయణ ఆశీస్సులతో పేరు ఖరారు
మూడు రోజుల్లో మార్కెట్ కమిటీల పదవుల ఖరారు
నెల్లూరు : నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ నాయకుడు కిలారి వెంకటస్వామి నాయుడుకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఖరారైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబు, మంత్రి నారాయణ ఆశీస్సులతో కిలారి పదవి దక్కించుకోబోతున్నారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు గుర్రుగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇందులో పనిచేస్తున్న కిలారి వెంకటస్వామినాయుడు నెల్లూరురూరల్ నియోజకవర్గం ఏర్పడ్డాక శాసనసభకు పోటీ చేయడానికి పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. టీడీపీ, వామపక్షాల పొత్తు కారణంగా 2009లో ఈ స్థానం సీపీఎంకు కేటాయించారు. 2014లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని వెంకటస్వామినాయుడు తీవ్రంగా ప్రయత్నించారు. చివరి నిమిషంలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో రూరల్ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు.
దీంతో అసంతృప్తికి గురైన కిలారికి పార్టీ అధికారంలోకి వస్తే జిల్లా స్థాయిలో గుర్తింపు ఉన్న పదవి ఇస్తామని చంద్రబాబునాయుడు బుజ్జగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే తనకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి ఇవ్వాలని వెంకటస్వామినాయుడు పార్టీ అధినేత చంద్రబాబును అడిగారు. ఇందుకోసం మంత్రి నారాయణ, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి మద్దతు కూడా తీసుకున్నారు. రెండేళ్లుగా నామినేషన్ పదవుల పందారం జరక్కపోవడంతో రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు తనకు అప్పగించాలని పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి చేస్తూ వచ్చారు.
ఆదాలతో అంతరం...
పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తనకు కాకుండా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇవ్వడంపై కిలారి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్టీ సమావేశాల్లో సైతం ఈ విషయాన్ని ఆయన చెబుతూ వచ్చారు. చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు పార్టీలోకి వచ్చిన తనకు నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇవ్వడాన్ని కిలారి తప్పుబట్టడం ఆదాల ప్రభాకర్‌రెడ్డికి ఏమాత్రం రుచించలేదు. దీంతో వారిద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రూరల్ నియోజకవర్గంలో తన పట్టు పెంచుకోవడానికి ఆదాల ప్రయత్నిస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పనులన్నీ తన అభీష్టం మేరకే మంజూరయ్యేలా రాజకీయం నడుపుతున్నారు. అయితే రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని దీటుగా ఎదుర్కోవడం కోసం మంత్రి నారాయణకు ఆ బాధ్యతలు ఇవ్వబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. మంత్రి ఈ ప్రచారాన్ని ఖండించలేదు. ఆదాల ఈ వ్యవహారంపైన ఆగ్రహించి జన్మభూమి - మా ఊరు సభలకు డుమ్మా కొట్టారు. రూరల్ ఇన్చార్జ్ బాధ్యతలు మీకే ఉంటాయని చంద్రబాబు ఆదాలను బుజ్జగించారు. ఈ వివాదం ముగిసి నెల తిరక్కుండానే ఆదాలకు తెలియకుండా ఆయన వ్యతిరేకి కిలారి వెంకటస్వామినాయుడుకు జిల్లాలో ప్రోటోకాల్ ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించడం ఆదాలకు ఆగ్రహం కలిగించింది.
తనతోపాటు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన పేర్నేటి కోటేశ్వరరెడ్డికి ఈ పదవి ఇప్పించాలని ఆదాల రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకత్వం కిలారికి ఈ పదవి ఇవ్వడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా తొలి నుంచి పార్టీలో ఉన్న ఎస్సీ సెల్ నాయకుడు పాముల రమణయ్యకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇప్పించాలని ఎమ్మెల్సీ సోమిరెడ్డి రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు కూడా తెలియకుండా పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై సోమిరెడ్డి కూడా ఆందోళనతో ఉన్నట్లు పార్టీ వర్గాలు ద్వారా తెలిసింది.
మూడు రోజుల్లో మార్కెట్ కమిటీల పదవుల ఖరారు
జిల్లాలోని గూడూరు, వాకాడు, సూళ్లూరుపేట, నాయుడుపేట మార్కెట్ కమిటీలకు పాలక మండలి నియామకం కోసం నాయకుల పేర్లు సిఫార్సు చేయాలని జిల్లా పార్టీ నాయకులతో నిర్ణయించింది. ఈ మేరకు ఆ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లకు సూచనలు ఇచ్చింది. దీంతోపాటు జిల్లాలో ఖాళీగా ఉన్న దేవాలయాల చైర్మన్లు, పాలక మండలి సభ్యుల పదవుల కోసం జాబితాలు ఇవ్వాలని జిల్లాలోని శాసనసభ్యులు, పార్టీ ఇన్‌చార్జ్‌లను ఆదేశించింది. ఈ జాబితాలు అందిన వెంటనే తొలివిడత పదవులు పందారం మొదలు పెట్టాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర సాక్షి ప్రతినిధికి చెప్పారు.
లోకేష్, నారాయణతో భేటీ
కిలారి వెంకటస్వామినాయుడు మంగళవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబును గుంటూరులో కలిశారు. తనకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి ఇప్పించాలని అడిగారు. ఆర్టీసీ విభజన జరగనందువల్ల ఈ పదవి ఇవ్వడం సాధ్యంకాదని, జిల్లా స్థాయిలో గుర్తింపు ఉన్న పదవి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇదే విషయంపై మంత్రి నారాయణతో లోకేష్ మాట్లాడారు. రూరల్ నియోజకవర్గ రాజకీయాల్లో తన ముద్ర వేసుకోవాలనే ఆలోచనతో ఉన్న నారాయణ ఇదే అదునుగా భావించి కిలారిని తన వద్దకు పిలిపించుకుని ఆయనతో చర్చలు జరిపి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి ఎంపికయ్యేలా రాజకీయం నడిపారు. లోకేష్‌బాబు సిఫార్సు మేరకు కిలారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇద్దామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రలను ఒప్పించారు. ఈ మేరకు కిలారి పేరు పార్టీ అధ్యక్షుడుకి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.