భారతీయ మహిళకు పద్నాలుగేళ్ల జైలు
మిల్పోర్డ్: తన సంరక్షణలో ఉన్న పద్నాలుగు నెలల బాబు చనిపోవడానికి కారణమైన ఓ భారతీయ యువతికి అమెరికాలో పద్నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. యూఎస్ ఫెడరల్ కోర్టు ఆమెకు ఈ శిక్షను ఖరారు చేసింది. కనెక్టికట్లో కింజాల్ పటేల్ (29) అనే భారతీయ యువతి చిన్న పిల్లల సంరక్షకురాలిగా ఉంది. ఓ రోజు ఆమె పెంపకంలో ఉన్న అతియాన్ శివకుమార్ అనే పద్నాలుగు నెలల బాబు తనకు చిరాకు తెప్పించడంతో కోపంతో విసురుగా నెట్టింది. దీంతో ఆ పసిబాలుడు నేరుగా ప్లోర్పై పడ్డాడు. ఈ క్రమంలో అతడి తలకు బలమైన గాయాలయ్యాయి. మూడు రోజుల అనంతరం ఆ బాబు చనిపోయాడు.
దీనికి సంబంధించి తొలుత పోలీసులు ఆమెను ప్రశ్నించగా బాబు మెట్ల మీద నుంచి కిందపడ్డాడని అబద్ధం చెప్పింది. కానీ, పోస్ట్ మార్టం నివేదికలో మాత్రం అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో జరిగిందంతా చెప్పింది. న్యాయమూర్తి ఆమెకు శిక్షను ఖరారు చేసేముందు ఆమె ఏ విధంగాను స్పందించలేదు. కనీసం న్యాయమూర్తితో ఒక్కమాటైనా మాట్లాడలేదు. దీంతో ఆమెను నేరం అంగీకరించినట్లుగా భావించి 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దాంతోపాటు సంరక్షణకు ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరో ఐదేళ్లు శిక్ష పడింది.