ఎంత కఠినమో
- రైలు చార్జీల పెంపుతో సామాన్యుల గగ్గోలు
- జిల్లా ప్రయాణికులపై రోజూ రూ.లక్షల అదనపు భారం
సాక్షి, రాజమండ్రి / రాజమండ్రి సిటీ : నరేంద్రమోడీ సర్కారు ఆదిలోనే తీసుకున్న బాదుడు నిర్ణయం జిల్లా ప్రజలపై అదనపు భారం మోపుతోంది. ముందెన్నడూ లేని విధంగా అన్ని రకాల రైలు ప్రయాణ చార్జీలను 14.2 శాతం పెంచడంతో జిల్లావాసులు గగ్గోలు పెడుతున్నారు. రైలు చార్జీల పెంపు ఖాయమని ముందు నుంచీ ప్రచారం జరిగినా సాధారణ ప్రయాణికులను మినహాయిస్తారని భావించారు. అయితే మోడీ సర్కారు.. ‘వడ్డించే’ విషయంలో తనకు ఎలాంటి విచక్షణా లేదని చాటుకుంది.
జిల్లాలో ప్రధాన మైన రాజమండ్రి రైల్వేస్టేషన్ నుంచి రోజూ 30 వేల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. సుమారు 3000 మంది రిజర్వేషన్‌తో వివిధ తరగతుల్లో ప్రయాణిస్తారు. తర్వాత ముఖ్యమైన సామర్లకోట నుంచి సుమారు 20 వేల మంది అన్ని తరగతుల్లో ప్రయాణిస్తారు. 2000 మందికి పైగా రిజర్వేషన్లను పొందుతారు. జిల్లా కేంద్రం కాకినాడ నుంచి రోజూ సుమారు 10 వేల మంది ప్రయాణిస్తారు. వెయ్యి మంది వరకూ రిజర్వేషన్లు చేయించుకుంటారు. పెంచిన చార్జీలతో నిత్యం వీరందరిపై రూ.లక్షల్లో అదనపు భారం పడనుంది. ప్రయాణ చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలు 6.5 శాతం పెరగడం వలన రాజమండ్రి స్టేషన్ నుంచి నిత్యం జరిగే వివిధ సరుకుల రవాణాపై అదనపు భారం పడనుంది.
చార్జీల పెంపు దారుణం..
ప్రజారంజకమైన పాలన అంటూ గద్దె నెక్కిన మోడీ సర్కార్ రైలు చార్జీలను అమాంతం పెంచి పేదల నడ్డి విరిచింది. పాలన చేపట్టి నెల కాకుండానే ఇలా చేయడం దారుణం. ధనిక వర్గాలతో సమానంగా టిక్కెట్ ధర పెంచడం పేదల పాలిట శాపంగా పరిణమించింది. పెంపును విరమించి పేదలను ఆదుకోవాలి.
- కేఎల్ఎన్రెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, రాజమండ్రి