నూరేళ్ల ఓహోహో దక్కన్ పీఠభూమి!
ఆర్ట్@ తెలంగాణ
కాఫీ టేబుల్ బుక్
ఈ ఆలోచన అనుకోకుండా వచ్చింది. ఇందుకు కారకులు డా.బి.వి.పాపారావు. 1998-99లో కొసావొ యుద్ధం జరిగినప్పుడు సాంస్కృతికంగా జరిగిన నష్టం గురించి అధ్యయనం చేయడానికి ఆయన యునెటైడ్ నేషన్స్ ప్రతినిధి బృందం నాయకుడిగా కొసావొ వెళ్లారు. అక్కడి మ్యూజియంను సందర్శించారు. ఆ సందర్భంగా ఆ చిన్ని దేశంలోని వెయ్యిమందికి పైగా క్రియాశీల చిత్రకారులు తయారు చేసిన ‘కొసావొ ఆర్ట్’ పుస్తకాన్ని బహుమతిగా పొందారు. హైదరాబాద్‌లో ఆ పుస్తకాన్ని చూసిన ఫిలిం మేకర్ బి.నరసింగరావుకు మన తెలంగాణ ఆర్ట్ గురించి ఇలాంటి ఒక పుస్తకం ఎందుకు రూపొందించకూడదు? ప్రపంచదేశాల మ్యూజియంలకు, దేశంలోని అన్ని ఆర్ట్ సెంటర్స్‌కు ఎందుకు పంపకూడదు? అనే ఆలోచన వచ్చింది. ఫలితంగా రూపొందినదే ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ కాఫీ టేబుల్ బుక్. బి.నరసింగరావు చీఫ్ ఎడిటర్‌గా, ఆనంద్‌కుమార్ గడప కంటెంట్ రచయితగా, ఏలె లక్ష్మణ్ ఆర్ట్ కోఆర్డినేటర్‌గా, అజిత్ నాగ్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేసిన కృషి ఇందులో ఉంది. అకారాది క్రమంలో ఎక్కా యాదగిరిరావు నుంచి యాసల బాలయ్య వరకూ 121 మంది కళాకారులను, అన్సంగ్ హీరోస్ శీర్షికన అజయ్‌కుమార్ బోస్ నుంచి యాసిన్ మహమ్మద్ వరకూ 29 మంది కళాకారులను పరిచయం చేస్తూ వారి వర్క్స్‌ను ప్రచురించారు. 1914 నుంచి 2014 వరకూ వచ్చిన ఎంపిక చేసిన చిత్ర-శిల్ప-లోహ సౌందర్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అన్నీ విలువైన రిఫరెన్సులే.
ఆర్ట్ ఎట్ తెలంగాణ ఎందుకు? ఈ ప్రశ్న వేసుకోగానే సహజంగానే ఇ.బి. హావెల్ గుర్తొస్తారు. బ్రిటిష్ ఇండియాలో 1896లో ఆయన కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ బాధ్యతలు తీసుకున్నాడు. గ్యాలరీని ఒకసారి పరికించాడు. ఇంగ్లండ్‌కు చెందిన నాసిరకం దళారీలు వేసిన చిత్రాలు గోడలపై మెరిసిపోతున్నాయి. కాని వేల సంవత్సరాల మానవేతిహాసపు భారతీయ సౌందర్యాలు నేలమాళిగల్లో ఉన్నాయి. గ్యాలరీలో ‘చెత్త’ను తొలగించాడు. భారతీయ సమాజాన్ని ప్రతిఫలించే చిత్రాలను వేలాడ దీశాడు. భారతీయులకు చదువా-సంస్కారమా అన్న మెకాలేను ఎండగట్టి మెకాలే మానస భారతీయ పుత్రులపై జాలి చూపాడు. భారతీయులు తమను గురించి తాము తెలుసుకోవాల్సి ఉందంటూ అత్యుత్తమ భారతీయ చిత్రంగా అబనీంద్రుని ‘కచుడు-దేవయాని’ని ప్రతిపాదించాడు. కచుడు దేవయాని పౌరాణిక పాత్రలే. కాని దేవయాని కచునితో ఇప్పటికీ మోసపోతూనే ఉంది కదా. ఈ నేపథ్యంలో ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ప్రాధాన్యత అవసరమవుతోంది. రక్తమూ లేదా కన్నీళ్లు తడపని నేల భూగోళంలో ఎక్కడా లేదు. ప్రతి ప్రాంతంలోనూ సమాజంలోనూ వ్యక్తీకరించాల్సిన జీవితం ఉంటుంది. పాలకులు ఆ పని చేయనప్పుడు, ఇతరులు కించపరచినప్పుడు చైతన్యవంతులైన ఆయా సమాజాలే, వ్యక్తులే ఇందుకు పూనుకోవాలి.
తూర్పు పడమర కనుమల మధ్యన ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్యన ట్రయాంగ్యులర్‌గా ప్రకృతి అమర్చిన పీఠభూమి దక్కన్. ఆదిలాబాద్ డయొనాసార్ బిర్లా ప్లానెటోరియంలో కొండమీద ఉంది. మిలియన్ల సంవత్సరాలుగా ఎగజిమ్మిన లావాలు కోటింగ్‌పై కోటింగ్ వేయగా సారవంతమైన భూమి ఏర్పడింది. ప్రకృతి అమర్చిన ఈ కాన్వాస్‌పై తెలుగు- కన్నడ- మరాఠీ మాట్లాడే ప్రజలు సహజీవనం చేశారు. ‘నయము- భయము- విస్మయము’ వంటి సమ్మిశ్రభావాలను కలిగించిన అనుభవాలెన్నో ఇందులో కళాత్మకంగా ఉన్నాయి. తెలంగాణ మోడరన్ పెయింటింగ్‌కు ఆద్యుడిగా రామకృష్ణ వామన్ దేస్కర్ను పరిగణిస్తారు. ఆయన సాలార్జంగ్ మ్యూజియం తొలి క్యూరేటర్. సాలార్జంగ్ పోర్టరైట్పై కదలాడే వెలుగునీడలను ఆయన పట్టిన తీరు అపురూపం. దేస్కర్, పి.టి.రెడ్డి, కొండపల్లి శేషగిరిరావు, తోట వైకుంఠం, లక్ష్మాగౌడ్, జగదీశ్ మిట్టల్ తదితరుల నుంచి పలువురు ఔత్సాహికుల వరకూ ఇందులో కొలువై ఉన్నారు. తెలంగాణ ప్రకృతిని, గ్రామాలను, ఆటపాటలను, కన్నీళ్లను, ఉత్సవాలను, బతుకమ్మను, సారాంశంలో అనేక పొరల జీవితం ఈ పుస్తకంలో నిక్షిప్తమై ఉంది.
అయితే ‘మరికొందరికి ఇందులో చోటు దొరికితే మంచిగుండేది’ అనే అసంతృప్తులు లేకపోలేదు. అవి పుస్తక ప్రాధాన్యతను తెలియజేసేవిగా భావించాలి. చనిపోయిన వారి జనన మరణ సంవత్సరాలు, సజీవుల వయస్సు తదితర వివరాలు ఇవ్వాల్సింది. తోటి తెలుగు రాష్ట్రపు సృజనశీలురు ఈ పుస్తకాన్ని స్పర్థగా తీసుకోవచ్చు. బాలాంత్రపు రజనీకాంతరావు మాటల్లో చెప్పాలంటే ఆర్ట్ ఎట్ తెలంగాణ నూరేళ్ల ‘ఓహోహో దక్కన్ పీఠభూమి’. పుస్తకం ఖరీదైనదే.
- పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
7680950863
‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’
నూరేళ్ల తెలంగాణ ఆర్ట్‌పై ఇంగ్లిష్ కాఫీ టేబుల్ బుక్
354 పేజీలు; కాపీలకు: వాల్డెన్; కవర్ ప్రైస్ : రూ.3,500