kottakonda
-
జై వీరభద్ర.....జై జై వీరభద్ర
ముగిసిన వీరభద్రుని నక్షత్ర దీక్షలు భీమదేవరపల్లి: జై వీరభద్ర.. జైజై వీరభద్ర అంటూ భక్తుల నామస్మరణతో మండలంలోని కొత్తకొండ వీరభద్రుని ఆలయం మార్మోగింది. యేటా శ్రావణ మాసంలో ఆలయంలో ఈ దీక్షలు ప్రారంభమవుతాయి. గత నెల 5న ప్రారంభమైన దీక్షలు 27 రోజుల పాటు కొనసాగి గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు ఇరుముడితో ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి సమీపంలోని గుట్టపైకి వెళ్లి ప్రత్యేక పూజల అనంతరం దీక్షలు విరమించారు. కార్యక్రమంలో ఈవో రామల సునీత, సర్పంచ్ సిద్దమల్ల రమేశ్, ఎంపీటీసీ కంకల సమ్మయ్య, ఉప సర్పంచ్ ఉప్పుల కుమారస్వామి, మాజీ చైర్మన్లు మాడిశెట్టి కుమారస్వామి, పిడిశెట్టి కనకయ్య అర్చకులు వీరభద్రయ్య, రాజన్న, సదానందం, రాంబాబు, వినయ్‌శర్మ, రమేష్, శ్రీకాంత్ ఉన్నారు. -
విద్యుదాఘాతానికి గురైన రైతు మృతి
భీమదేవరపల్లి: విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో నెల రోజుల క్రితం విద్యుదాఘాతానికి గురైన ఓ రైతు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తకొండకు చెందిన జుర్రు వెంకటాద్రి(50) తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో పత్తి, వరి వేశాడు. ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సక్రమంగా ప్రసారం కాకపోవడంతో తన వ్యవసాయ మోటర్ పనిచేయలేదు. గత నెల 30న అదే గ్రామానికి చెందిన ఓ రైతు సహాయంతో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి ఫీజు వైర్ సరిచేస్తుండగా అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ సరఫరా అయింది. దీంతో వెంకటాద్రి షాక్‌కు గురయ్యాడు. పైనుంచి సమీపంలోని ఎర్త్ వైర్ రాడ్డుపై పడ్డాడు. దీంతో నడుము భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందతూ మృతి చెందాడు. మృతుడికి భార్య వనమాల, కుమారుడు అనిల్, కూతురు అనూష ఉన్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో రూరల్ ఏఈ రాకేశ్‌ను వివరణ కోరగా తమ అనుమతి లేకుండా రైతు ట్రాన్స్ఫార్మర్కు ఫీజు వేస్తుండగా ప్రమాదం జరిగిందని, రైతు మృతి చెందాక తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. దీనిపై అధికారులకు విన్నవిస్తామని పేర్కొన్నారు.