విద్యుదాఘాతానికి గురైన రైతు మృతి
Published Tue, Aug 30 2016 9:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
భీమదేవరపల్లి: విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో నెల రోజుల క్రితం విద్యుదాఘాతానికి గురైన ఓ రైతు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తకొండకు చెందిన జుర్రు వెంకటాద్రి(50) తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో పత్తి, వరి వేశాడు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సక్రమంగా ప్రసారం కాకపోవడంతో తన వ్యవసాయ మోటర్ పనిచేయలేదు. గత నెల 30న అదే గ్రామానికి చెందిన ఓ రైతు సహాయంతో ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేసి ఫీజు వైర్ సరిచేస్తుండగా అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ సరఫరా అయింది. దీంతో వెంకటాద్రి షాక్‌కు గురయ్యాడు. పైనుంచి సమీపంలోని ఎర్త్ వైర్ రాడ్డుపై పడ్డాడు. దీంతో నడుము భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందతూ మృతి చెందాడు. మృతుడికి భార్య వనమాల, కుమారుడు అనిల్, కూతురు అనూష ఉన్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో రూరల్ ఏఈ రాకేశ్‌ను వివరణ కోరగా తమ అనుమతి లేకుండా రైతు ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫీజు వేస్తుండగా ప్రమాదం జరిగిందని, రైతు మృతి చెందాక తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. దీనిపై అధికారులకు విన్నవిస్తామని పేర్కొన్నారు.
Advertisement