అశ్లీలతకు వేయలేమా కళ్లెం?
దేశాన్ని పట్టి పీడిస్తున్న రెండు రుగ్మతలు అశ్లీలత, అవినీతి. అవినీతి విషయంలో ఏదో ఒక మేరకు సామాజిక స్పృహ కనిపిస్తున్నా, ప్లేగు వ్యాధిలా విస్తరిస్తున్న అశ్లీలత విషయంలో పెద్దగా పట్టింపు కనబడటం లేదు. ఒకప్పుడు సినిమాలకే పరిమితమైన అశ్లీలత, అసభ్యత నేడు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇంటింటికీ ప్రవేశిస్తోంది. ఎంటర్టైన్మెంట్ పేరిట అసభ్య, అశ్లీల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నా పట్టడం లేదు. సినిమాల్లాగే టీవీ కూడా కుటుంబ సభ్యులంతా కలసి కూచుని చూసేలా ఉండకుండా పోతుండటం విచారకరం. పైగా వినోదం పేరిట పబ్, క్లబ్‌ల సంస్కృతిని విస్తరింపజేస్తు న్నారు.
ఈ వికృత జీవన శైలి విద్యార్థులను, యువతను పెడదోవపట్టిస్తోంది. ఈవ్ టీజింగ్, అత్యాచారాలు, హింసా కాండ, నాటకీయమైన దోపిడీలు ఇటీవలి కాలంలో పెచ్చు పెరిగాయి. కానీ యువతను అటు ప్రేరేపిస్తున్న ఈ ‘వినోదం’ జోలికి పోవడం లేదు. వీటికి తోడు ఇంటర్నెట్ ద్వారా వ్యాపిస్తున్న నీలి సంస్కృతి విషయంలోనూ ఆర్భాటా నికి మించిన ఆచర ణ కనబడటం లేదు. ఇప్పటికైనా పాలకు లు, పార్టీలు, మీడియాల తీరు మారాలి. అశ్లీలత, అసభ్యత, నేరగ్రస్తతలకు తావులేని సమాజం కోసం నడుంబిగించాలి.
కె. శారదా ప్రసాద్, హైదరాబాద్