సిరిసిల్ల జిల్లా పోరు ఉధృతం
మంత్రి కేటీఆర్ నివాసం, ఆర్డీవో ఆఫీస్ ముట్టడి
ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం ఉధృతమైంది. చుట్టుపక్కల పల్లెలు తరలివచ్చాయి. గురువారం రాష్ట్ర టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సిరిసిల్లలోని మంత్రి కేటీఆర్ నివాసానికి రాగా జిల్లా సాధన జేఏసీ ముట్టడించింది. ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ముస్తాబాద్ మండలం ఆవునూరు, గూడెం, కొండాపూర్, తుర్కపల్లె గ్రామస్తులు సిరిసిల్లలో రాస్తారోకో చేశారు. ఆర్డీవో ఆఫీస్‌ను ముట్టడించారు. న్యాయవాదుల దీక్ష శిబిరాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ సందర్శించి సంఘీభావం తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వద్ద వంటావార్పు చేశారు. సిరిసిల్ల జిల్లా చేయాలని కోరుతూ మున్సిపల్ ప్రతిపక్ష కౌన్సిలర్లు ఏడుగురు రాజీనామా చేశారు. కాంగ్రెస్ కౌన్సెలర్లు బుర్ర నారాయణగౌడ్, మడపు శ్రీదేవి, వెల్ముల స్వరూపారెడ్డి, బీజేపీ కౌన్సెలర్లు ఎర్రం వెంకట్రాజం, భీమవరం రాధిక, గడ్డం లత, టీడీపీ కౌన్సిలర్ దార్ల సందీప్ తమ రాజీనామాలకు మున్సిపల్ కమిషనర్‌కు అందజేశారు. జేఏసీ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను, కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందించారు.