మాకూ ఓ టికెట్..!
మహబూబ్‌నగర్ అర్బన్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాడి ని పసిగట్టి అభ్యర్థుల కసరత్తులో భాగంగా జిల్లా కు ఏఐసీసీ తరపున వచ్చిన పరిశీలకునికి ఇక్కడి పరిస్థితి కళ్లకు కట్టింది. నేతల మధ్యనున్న విబేధా లు, అంతర్గత పోరు కొట్టొచ్చినట్లు కనిపించింది. జిల్లా కేంద్రానికి సమీపంలో గల లక్ష్మీ గార్డెన్ ఫం క్షన్‌హాల్‌లో శనివారం మహబూబ్‌నగర్ పార్లమెం టుస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకుడు కర్ణాటక ఎమ్మెల్యే ఎ.మంజు తన సహాయకులతో కలిసి ఫంక్షన్హాల్లోని ఓ గదిలో కూర్చొని అభిప్రాయ సేకరణ జరిపారు.
క్యూ కట్టిన నేతలు...
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మండల,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సింగిల్ విండో, మార్కెట్ కమిటీల చైర్మన్లు, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సెలర్లు, పీసీసీ డెలిగేట్లను పిలిచి ఎంపీ , ఎమ్మెల్యే స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న వారిపై అభిప్రాయాలను తీసుకున్నారు. మధ్యాహ్న భోజన సమయానికి నారాయణపేట,మక్తల్ అసెంబ్లీ నియోజక వర్గాల కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు. జిల్లా మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ కె.వీరారెడ్డి, మాజీ ఎంపీలు మల్లు రవి, విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికూడా హాజరై తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోరారు.
రెండోపూట రభస
మధ్యాహ్న భోజనానంతరం పరిశీలకుడు మంజు తిరిగి అభిప్రాయ సేకరణ చేపట్టారు. దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన డోకూరు పవన్‌కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పి.విశ్వేశ్వర్, ప్రదీప్‌కుమార్ గౌడ్లు తమ అనుయాయులతో ప్రదర్శనగా రావడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ దశలో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు తొలుత తోపులాటతో ప్రారంభించి ముష్టిఘాతాల వరకు వెళ్లారు. తీవ్రతను గమనించి డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ రంగంలోకి దిగి ఇరువర్గాలకూ సర్ది చెప్పారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ ,నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, అసెంబ్లీ నియోజక వర్గాలతో మహబూబ్‌నగర్ పార్లమెంటు అభ్యర్థులపై కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోగా, టికెట్ల ఆశావహులు తమ తమ దరఖాస్తులను సవివరంగా అందించారు.