డ్రైవింగ్ లెసైన్స్ ఉంటేనే మేలు
రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న ప్రస్తుత పోటీ ప్రపంచంలో అధిక శాతం ప్రజలు తమ అవసరాలు, ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా ఏదో ఒక వాహనాన్ని వినియోగిస్తున్నారు. వీటిలో ద్విచక్ర వాహనాల సంఖ్యే అధికం. పాఠశాలకు వెళ్లే పిల్లల నుంచి పెద్దవాళ్లు, మహిళలు అందరూ రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేస్తున్న చోదకులు డ్రైవింగ్ లెసైన్స్ పొందడంపై శ్రద్ధ చూపడం లేదు. లెసైన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం.
అందుకు జరిమానా విధించే అవకాశం ఉంది. లెసైన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే కఠిన శిక్ష విధించడంతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తారు. ప్రమాదం జరిగిన సమయంలో గాయపడిన వారి వివరాలు.. బ్లడ్‌గ్రూప్ తెలియాలన్నా వెంట లెసైన్స్ ఉండాల్సిందే. - న్యూస్‌లైన్, ఆదిలాబాద్ క్రైం
ప్రస్తుతం వాహనాలు నడుపుతున్న వారిలో 80 శాతం మందికి లెసైన్స్ లేదని పోలీసుల తనిఖీల్లో వెల్లడైం ది. ద్విచక్ర వాహనం నడిపే వారిలో 18 సంవత్సరాల కం టే తక్కువ వయసు గలవారూ ఉండడంతో జరిమానా వి ధించి వదిలేస్తున్నారు. ప్రతీ రోజు నిర్వహించే తనిఖీల్లో ప ట్టుబడే వారిలో లెసైన్స్ లేని వారే అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో లెసైన్స్ లేకుండా కొందరు బస్సులు, కార్లు, ఇతర హెవీ వెహికిల్స్ నడుపుతున్నట్లు తేలింది.
మరికొందరు కాలం చెల్లించిన లెసైన్స్‌ను చూపిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వాహనానికి బీమా ఉన్నప్పటికీ లెసైన్స్ లేని కారణంగా పరిహారం పొం దలేకపోతున్నారు. లెసైన్స్ లేకుండా లైట్‌మోటార్ వాహ నం నడిపిస్తే రూ.2,500, హెవీ వెహికిల్స్‌కు రూ.5,000 జరిమానా విధిస్తారు. ఇలా విధించిన జరిమానాలతో రవాణాశాఖకు ఈ ఏడాది రూ.47.50 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో వెయ్యి లైట్‌మోటార్ వెహికిల్స్‌కు రూ.2,500 చొప్పున జరిమానా విధించగా.. రూ.25లక్షలు, 450 హెవీమోటార్స్కు రూ.5వేల చొప్పున జరిమానా విధించగా.. రూ.22.50లక్షలు ఆదాయం సమకూరింది. ఈ లెక్కన ఎంతమంది లెసైన్స్ లేదో ఇట్టే తెలిసిపోతోంది.
లెసైన్స్ ఉంటే మేలు..
లెసైన్స్ లేకుండా వాహనాలు నడిపిస్తే అన్ని విధాలా నష్టమే. ఇటు జరిమానాతోపాటు కొన్ని సందర్భాల్లో వాహనాలూ జప్తు చేస్తుంటారు. లెసైన్స్ ఉంటే జరిమానా కట్టాల్సిన అవసరం ఉండదు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బీమా వర్తిస్తుంది.
రకాలు..
డ్రైవింగ్ లెసైన్స్‌లో పలు రకాలు ఉన్నాయి. లైట్‌మోటర్ వెహికిల్ లెసైన్స్‌లో విత్గేర్, వితౌట్ గేర్ ఉంటాయి. ఈ కేటగిరీలో ద్విచక్ర వాహనం, కారు, ఆటో, ట్రాక్టర్, డీసీఏం తదితర వాహనాలు ఉంటాయి. హెవీలెసైన్స్లో లారీలు, బస్సులు తదితర భారీ ట్రాన్స్‌పోర్టు వాహనాలు వస్తాయి. ద్విచక్రవాహనం, ఆటో, కారు మూడింటికి కలిపి లర్నింగ్ లెసైన్స్‌కు రూ.120 చెల్లించాలి. పర్మినెంట్ లెసైన్స్ కోసం ఆటో, కారు వాహనాలకు రూ.515, హెవీలెసైన్స్కు రూ.465 చెల్లించాల్సి ఉంటుంది.
అనుమతి పత్రం తప్పనిసరి
లెసైన్స్ అంటే వాహనం నడిపే అర్హత, నడపగల శక్తి, వ్యక్తి వాహనం నడపగలడని నిర్దారించి ఇచ్చే అనుమతి పత్రం. లెసైన్స్ లేకపోవడంతో చాలామంది రవాణా శాఖ నిబంధనలు తెలియక ఇష్టారీతిగా వాహనాలు నడుపుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగిన విలువైన ప్రాణా లు కోల్పోతున్నారు. లెసైన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిలో యువత, 18ఏళ్లలోపు పిల్లలే అధికంగా ఉండడం గమనార్హం. తెలిసీ తెలియని వయసులో వాహనాలు నడిపి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. లెసైన్స్ పొందామంటే వాహనం నడపగల సామర్థ్యం ఉందని అర్థం. అప్పు డు నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడిపితే ప్రమాదాలూ జరగవు. అందుకే ప్రతి ఒక్కరూ లెసైన్స్ పొందడం బాధ్యతగా భావించాలి.
పొందడం సులభమే..
డ్రైవింగ్ లెసైన్స్ పొందడానికి ముందుగా లర్నింగ్ లెసైన్స్ తీసుకోవాలి. ఇందుకోసం ఏదైనా గుర్తింపుకార్డు, జనన ధ్రువీకరణ పత్రం, మీ సేవ కేంద్రాల్లో రూ.60 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఫలానా తేదీన ఆర్టీఏ కార్యాలయానికి రావాలని రశీదు ఇస్తారు. ఆ రోజు వెళితే ట్రాఫిక్ నిబంధనలపై కంప్యూటర్లో పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించకపోతే మళ్లీ వారం రోజుల తర్వాత రూ.30 చెల్లించి పరీక్షకు హాజరు కావాలి. ఇలా మూడుసార్లు హాజరైనా ఉత్తీర్ణత సాధించకపోతే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి లర్నింగ్ లెసైన్స్ జారీ చేస్తారు. దీని కాలపరిమితి ఆరు నెలలు ఉంటుంది.
అనంతరం లెసైన్స్ కోసం నిర్ణీత మొత్తాన్ని మీ సేవ కేంద్రంలో చెల్లించి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ డ్రైవింగ్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణత సాధిస్తే పోస్టులో ఇంటికి లెసైన్స్ పంపిస్తారు. దీని కోసం రూ.35 పోస్టల్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. 16నుంచి 18ఏళ్లలోపు వారికి వితౌట్ గేర్ వాహనాలకు, 18ఏళ్లు నిండినవారికి గేర్‌తో కూడిన వాహనాల లెసైన్స్ జారీ చేస్తారు. ట్రాన్స్‌పోర్టు లెసైన్స్ పొందాలంటే 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మొదట లర్నింగ్ లెసైన్స్స్ తీసుకుని, ఏడాది లోపు పర్మినెంట్ లెసైన్స్ తీసుకోవాలి. తర్వాత బ్యాడ్జీ లెసైన్సు కోసం దరఖాస్తు చేసుకుని పొందాలి.