అభోజన ఆహారం
అభోజనం అంటున్నారు! ఆహారం అంటున్నారు?!
ఏం లేదండీ, భోజనానికి మెనూ ఉంటుంది కదా... అదనీ, ఇదనీ!
అలాగే అభోజనానికీ ఓ మెనూ అన్నమాట!
కార్తికంలో ఉపవాసం ఉండేవాళ్లకి ది మరీ మరీ స్పెషల్.
ఆకలితో ఉండీ ఉండీ ఒక్కసారిగా...
ఫుల్మీల్స్తో ఫాస్టింగ్కి ‘బ్రేక్’ ఇస్తే ఏమైనా ఉందా?!
జీర్ణక్రియ... విస్తరి మడిచేయదూ...
అందుకే మీ ఆకలి చల్లారుస్తూ, మిమ్మల్ని చురుగ్గా ఉంచే లైట్ ఫుడ్... డిలైట్ ఫుడ్... ఈ వారం మీ కోసం.
సగ్గుబియ్యం - పల్లీ పొడి
కావలసినవి:
సగ్గుబియ్యం - కప్పు; బంగాళదుంపలు - 2 (చిన్నవి)
వేయించిన పల్లీలు - అర కప్పు; ఉప్పు - తగినంత
పంచదార - అర టీ స్పూను; నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - టీ స్పూను; కరివేపాకు - 3 రెమ్మలు
పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను
అల్లం తురుము - టీ స్పూను
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
నిమ్మరసం - అర టీ స్పూను; కొత్తిమీర - కొద్దిగా
తయారీ:
సగ్గుబియ్యాన్ని సుమారు మూడు గంటలు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి.
బంగాళదుంపలను ఉడికించి, తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి
పల్లీలను మిక్సీలో వేసి పొడి చేయాలి
ఒక పాత్రలో పల్లీల పొడి, ఉప్పు, పంచదార, సగ్గుబియ్యం వేసి కలపాలి
బాణలిలో నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి వేయించాలి
కరివేపాకు, పచ్చి మిర్చి వేసి, వేగాక అల్లం తురుము జత చేసి దోరగా వేయించాలి బంగాళదుంప ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి
సగ్గుబియ్యం మిశ్రమం వేసి, పదార్థాలన్నీ కలిసేలా కలియబెట్టాలి
కొద్దిసేపు ఉడికించాక (మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు) కొబ్బరి తురుము వేసి బాగా కలిపి దించే ముందు కొత్తిమీర, నిమ్మరసం వేయాలి.
దోసకాయ బర్ఫీ
కావలసినవి:
బొంబాయి రవ్వ - ఒకటిన్నర కప్పులు; దోసకాయ తురుము - 2 కప్పులు (గింజలు తీసేసి, తురుములోని నీరంతా ఒక పాత్రలోకి పిండి, తురుము పొడిపొడిగా ఉండేలా చేయాలి); బెల్లం పొడి - ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి - టీ స్పూను; పచ్చి కొబ్బరి తురుము - ముప్పావు కప్పు; జీలకర్ర పొడి - పావు టీ స్పూను; జీడిపప్పు తరుగు - 3 టేబుల్ స్పూన్లు; కొబ్బరి నూనె - అర టీ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను
తయారీ:
ముందుగా బాణలిలో బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి
బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక, దోసకాయ తురుము వేసి, పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి
ఒక పాత్రలో బొంబాయి రవ్వ, దోసకాయ తురుము, పక్కన ఉంచిన దోసకాయ నీళ్లు, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు తరుగు, బెల్లం పొడి వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి సుమారు అరగంట సేపు ఉడికించాక, ఏలకుల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి
ఒక ప్లేటుకి కొబ్బరి నూనె పూసి, ఉడికించిన దోసకాయ మిశ్రమం అందులో వేసి, కొద్దిగా చల్లారాక చాకుతో ముక్కలుగా కట్ చేయాలి.
ఫ్రూట్ రైతా
కావలసినవి:
చిక్కటి పెరుగు - కప్పు;
పంచదార - టేబుల్ స్పూను;
రాక్ సాల్ట్ - చిటికెడు;
జీలకర్ర పొడి - చిటికెడు;
కారం - చిటికెడు;
దానిమ్మ గింజలు - పావు కప్పు;
ఆపిల్ ముక్కలు - పావు కప్పు; అరటిపండు ముక్కలు - పావు కప్పు;
బాదం పప్పులు - ఆరు (చిన్న ముక్కలుగా చేయాలి)
తయారీ:
పెరుగును (నీళ్లు పోయకూడదు) గిలక్కొట్టాలి
పంచదార, రాక్ సాల్ట్, జీలకర్ర పొడి, కారం జత చేసి కలపాలి
ఒక పాత్రలో పండ్ల ముక్కలన్నీ వేసి ఆ పైన పెరుగు మిశ్రమం పోయాలి
దానిమ్మ గింజలు, బాదం పప్పు ముక్కలు పైన చల్లి, చల్లగా అందించాలి.
బియ్యపురవ్వ రొట్టె(కొయ్య రొట్టె)
కావలసినవి:
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; నీళ్లు - 2 గ్లాసులు; ఉప్పు - తగినంత; సెనగపప్పు - 3 టేబుల్ స్పూన్లు; బియ్యపురవ్వ - గ్లాసు; పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు;
తయారీ:
మందపాటి గిన్నె స్టౌ మీద ఉంచి, టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి
రెండు గ్లాసుల నీళ్లు, ఉప్పు వేసి కలపాలి
సెనగపప్పు వేసి బాగా కలిపి నీళ్లు మరుగుతుండగా రవ్వ వేస్తూ ఆపకుండా కలిపి మంట తగ్గించి మూత ఉంచాలి
బాగా ఉడికిన తర్వాత కొబ్బరి తురుము వేసి కలియబెట్టాక, కొద్దిగా నెయ్యి వేసి కలిపి దించి చల్లారనివ్వాలి
స్టౌ మీద పెనం ఉంచి కాలాక, ఉడికించిన బియ్యపురవ్వను గరిటెడు తీసుకుని, పెనం మీద వేసి, చేతితో మందంగా ఉండేలా ఒత్తి, మంట తగ్గించి, చుట్టూ నెయ్యి వేసి మూత ఉంచాలి
కొద్దిసేపయ్యాక రెండో వైపు తిప్పి, కొద్దిగా నెయ్యి వేసి మూత ఉంచి రెండు మూడు నిమిషాలయ్యాక తీసేయాలి
కొబ్బరి పచ్చడితో తింటే బాగుంటుంది.
రోటి చలిమిడి
కావలసినవి:
బియ్యం - పావు కేజీ; బెల్లం పొడి - పావు కేజీ (గట్టి బెల్లం వాడాలి); ఏలకుల పొడి - టీ స్పూను; కొబ్బరి తురుము - పావు కప్పు; ఎండు కొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి - టేబుల్ స్పూను
తయారీ:
బియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరు వడబోసి బియ్యంలోని నీళ్లు పోయేవరకు పొడి వస్త్రం మీద ఆరబోయాలి
కొద్దిగా తడి ఆరాక, బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి పట్టి, జల్లించాలి
పిండి తడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకుని గట్టిగా నొక్కిపెట్టాలి
మిక్సీలో బెల్లం పొడి వేసి మెత్తగా చేశాక, కొద్దికొద్దిగా బియ్యప్పిండి జత చేస్తూ మిక్సీ తిప్పాలి
పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరో మారు మిక్సీ పట్టాలి
చివరగా ఏలకుల పొడి, నెయ్యి వేసి మరోమారు మిక్సీ తిప్పి, గిన్నెలోకి తీసుకోవాలి బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక ఎండుకొబ్బరి ముక్కలు వేసి వేయించి తీసేసి, చలిమిడి గిన్నెలో వేసి కలపాలి
నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేయాలి.
(ఈ చలిమిడిని పూర్వం రోలు ఉపయోగించి చేసేవారు. అందుకే దీన్ని రోటి చలిమిడి అనేవారు. ఇప్పుడు కూడా రోలు ఉన్న వాళ్లు మిక్సీ బదులు రోట్లో చేసుకోవచ్చు)
తోటకూర గింజల (అమరాంథ్) యోగర్ట్
కావలసినవి:
అమరాంథ్ గింజలు - 2 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); ఖర్బూజా పండు - 1 (చిన్నది); అరటిపండు - 1; జీడిపప్పులు - 10; కిస్మిస్ - 15; ఎండు ఖర్జూరాలు - 6; తేనె - తగినంత; పెరుగు - అర కప్పు;
తయారీ:
బాణలి వేడి చేసి, రెండు టేబుల్ స్పూన్ల అమరాంథ్ గింజలు వేసి, వేయించి తీసి పక్కన ఉంచాలి
ఖర్బూజా తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలు చేయాలి
అరటి పండును చిన్న ముక్కలుగా కట్ చేయాలి
ఒక పాత్రలో అరటిపండు ముక్కలు, ఖర్బూజా ముక్కలు వేసి పక్కన ఉంచాలి
బాణలిలో జీడిపప్పులు, కిస్మిస్లు విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి
ఎండుఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి
ఒక గ్లాసులో ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి, పైన అర టీ స్పూను తేనె వేసి, ఆ పైన కొన్ని పండ్ల ముక్కలు, కొన్ని ఎండుఖర్జూరం ముక్కలు, కొన్ని జీడిపప్పు ముక్కలు వేశాక, అమరాంథ్ గింజలు వేయాలి
మరోమారు తేనె వేయాలి
ఇలా ఒకదాని తరువాత మరొకటి వేసి కొద్దిసేపు ఫ్రిజ్లో ఉంచి, తీసి చల్లగా అందించాలి.
సేకరణ: డా. వైజయంతి