నేటి నుంచే ఎల్&టీ ఇన్ఫోటెక్ ఐపీఓ
న్యూఢిల్లీ : దేశీయ ఆరో అతిపెద్ద ఐటీ సంస్థ ఎల్&టీ ఇన్ఫోటెక్ తొలి పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) నేటినుంచి ప్రారంభంకానుంది. తొలి పబ్లిక్ ఆఫర్ తో కంపెనీ రూ.1,243 కోట్లను సమీకరించనుంది. రూ.1.75 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో అమ్మకానికి ఉంచనుంది. ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.705-710గా నిర్ణయించింది. రూ.710 ధరతో రూ.1,243.50 కోట్లను...రూ.705 ధరతో రూ.1,233.75 కోట్లను కంపెనీ సమీకరించాలనుకుంటోంది. నేటి నుంచి జూలై 13 వరకూ ఈ సబ్ స్క్రిప్షన్ కొనసాగనుంది.
ఈ ఆఫర్ తో మార్కెట్లో ఎల్&టీ షేర్లు దూసుకెళ్తున్నాయి. ఎన్ఎస్ఈ లో ఎల్&టీ రూ.28.80 లాభపడి రూ.1561.80గా నమోదవుతోంది. యాంకర్ పెట్టుబడిదారులకు రూ.710 లకు షేర్లను ఇష్యూ చేయడం ద్వారా ఇప్పటికే రూ.373 కోట్లను కంపెనీ సమీకరించింది.
కొటక్ మహింద్రా క్యాపిటల్ కంపెనీ, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యురిటీస్ ఈ ఇష్యూను మేనేజ్ చేయనున్నాయి.
ఎల్&టీ ఇన్ఫోటెక్ రెవెన్యూలను వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.13,500 కోట్లకు(2 బిలియన్ డాలర్లకు) పెంచనున్నట్టు ఎల్&టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏమ్ నాయక్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎల్&టీ ఇన్ఫోటెక్ రెవన్యూలు, ఇతర ఆదాయాలు రూ.6,143.02 కోట్లకు పెరిగాయి. పన్నుల తర్వాత లాభాలు రూ.922.17 కోట్లగా ఉన్నాయి. కంపెనీ రెవెన్యూల పరంగా, ఉద్యోగుల పరంగా భారతీయ ఐటీ సర్వీసులో ఎల్&టీ ఇన్ఫోటెక్ ఆరవ అతిపెద్ద కంపెనీగా ఉంది.