మాలిన్ దుర్ఘటనకు ముందు పెద్ద శబ్దం
సాక్షి, ముంబై: వర్షానికి తడిసిన కొండచరియలు విరిగి పడే దుర్ఘటన జరిగిందా? మరి ఈ ప్రమాదం జరగడానికి ముందు వచ్చిన పెద్ద శబ్దం ఏంటి? పిడుగుపాటా? ఏదైనా విస్ఫోటనం జరిగిందా?... పుణేలోని మాలిన్ దుర్ఘటనపై స్థానికుల్లో వ్యక్తమవుతు న్న అనుమానాలివి. దుర్ఘటన జరగడానికి ముందు భారీ పేలుడువంటి శబ్దం వినిపించిందని స్థాని కులు చెబుతున్నారు. శబ్దం అనంతరం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి గ్రామం నామరూపాల్లేకుండా పోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా బయటపడిన మృతదేహాల సంఖ్య 90కి చేరింది. ఇంకా చాలా మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
కారణమేంటో తెలుసుకుంటాం: పాటిల్ మాలిన్ దుర్ఘటనకు ముందు వచ్చిన శబ్దం దేని కారణంగా వచ్చిఉంటుందనే విషయంపై నిపుణులతో చర్చించి దర్యాప్తు జరిపిస్తామని హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ హామిఇచ్చా రు. మాలిన్ దుర్ఘటనతో క్షతగాత్రులుగా మారి చికిత్సపొందుతున్నవారిని పాటిల్ పరామర్శించారు.
ఈ సందర్భంలో బాధితులు చెప్పిన వివరాలను సావధానంగా విన్న పాటిల్ అనంతరం ఆయన మీడియాతోమాట్లాడారు. మాలిన్ సంఘటన తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. కొండచరియలు విరిగి పడడానికి ముందు రాత్రంత ఉరుములు, మెరుపులతో వర్షం కురిసిందని, బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చిందని, అనంతరం కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయని బాధితులు తనతో చెప్పారన్నారు. అయితే భారీ శబ్దం పిడుగుపాటు కారణంగా వచ్చిందా..? మరేకారణమైనా ఉందా? అనే విషయంపై దర్యాప్తు జరిపిస్తామని పాటిల్ చెప్పారు.