హామీలపై అసెంబ్లీలో చర్చించాలి
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. హామీల అమలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడించారు.
ఈ సందర్భంగా గుండా మల్లేశ్ మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని విమర్శించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని అన్నారు. ఆగస్టు 19న సర్వే చేసి ఇప్పుడు మరో సర్వే ఎందు చేపడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ముందుకు సాగుతుందో.. లేదోననే అనుమానం ఉందన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది దళితులు ఉన్నారని, వీరికి సుమారు 15 లక్షల ఎకరాల భూమి అవసరమని తెలిపారు.
పరిశ్రమలకు భూమి సిద్ధగా ఉందంటున్న ప్రభుత్వం దళితులకు మూడెకరాలు ఎందుకు పంపిణీ చేయలేకపోతుందో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాాష్ట్ర నాయకులు వెంకటరామయ్య, సీపీఎం రాష్ట్ర నాయకుడు టి.సాగర్, సీపీఐ జిల్లా కార్యదర్శి శంకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.విలాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు నారాయణ, సీపీఐ నాయకులు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, నళినిరెడ్డి, విద్యార్థి నాయకులు చంటి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాగా, అంతకుముందు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు ర్యాలీగా తరలివచ్చారు. గేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. సమస్యలతో కూడిన వినతిపత్రం కలెక్టర్ జగన్మోహన్కు అందజేసేందుకు లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయకులను జీపుల్లో, డీసీఎంలో తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని సుమారు 250 మంది వరకు వన్‌టౌన్‌కు వెళ్లారు. నాయకులను విడుదల చేయాలని నినదించారు.