చిన్నారులపై దాడుల నివారణకు సీఏఎంసీ కమిటీ
14న ఈ పథకాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
హైదరాబాద్: అన్నెం పున్నెం ఎరుగని చిన్నారి బాల బాలికలపై సమాజంలో సాగుతున్న లైంగిక దాడులు, అనుచిత ప్రవర్తన, అకృత్యాలకు చెక్ పెట్టేందుకు చైల్డ్ అబ్యూజ్ మేనేజ్మెంట్ కమిటీ(సీఏఎంసీ)లు ఏర్పాటు చేయనున్నారు. సీఐడీ విభాగం రూపొందించిన పథకానికి సీఎం కేసీఆర్ ఈనెల 14న బాలల దినోత్సవం రోజున ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ నెక్లెస్ రోడ్డులో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీని కూడా నిర్వహించడానికి పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో కలసి సీఐడీ ఐజీ ఈ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా కిడ్నాప్‌లు, లైంగిక దాడులు, అనుచిత ప్రవర్తన పెద్దల నుంచి పెరిగి పోవడంపై కేస్ స్టడీ తీసుకున్న అధికారులు వాటిపై చిన్నారుల్లో చైతన్యాన్ని పెంచే విధంగా లఘు చిత్రాలతో సీడీలను రూపొందించారు. అందులో వ్యక్తుల స్పర్శను బట్టి వారిలో మంచి వారు ఎవరో , చెడ్డ వారు ఎవరో తెలుసుకునేలా అంశాలను పొందుపరిచారు. ఇందుకు సంబంధించిన సీడీలు, స్టిక్కర్లు, ప్రచార సామగ్రితో కూడిన ఒక కిట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. వీటిని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందచేయనున్నారు. ప్రతి పాఠశాల నుంచి ఒక టీచర్‌ను కౌన్సెలర్‌గా ఎంపిక చేసి వారికి శిక్షణను కూడా ఇవ్వనున్నారు.