ఢాకా ఉగ్రదాడి: జేఎంబీ కమాండర్ హతం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్ పై దాడులకు పాల్పడ్డ ఘటనలో కీలక నిందితుడిగా భావిస్తున్న ఉగ్రవాది అబు ముసా(32)ను పోలీసులు మంగళవారం హతం చేశారు. ఉగ్రవాది జహంగీర్ అలాంకు ఇతడు సన్నిహితుడని బంగ్లా పోలీసులు తెలిపారు. రాజధాని ఢాకాకు 200 కిలోమీటర్ల దూరంలో బోగ్రా జిల్లాలో ఉగ్రవాదుల కదలికపై సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టినట్లు స్థానిక పోలీసు చీఫ్ నూర్ అలామ్ సిద్ధిఖీ వెల్లడించారు. ఇందులో భాగంగా ఢాకా కేఫ్ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకడైన అబు ముసాను కాల్చి చంపేశారు. జమాత్ ఉల్ ముజాహిద్దిన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి ముసా కమాండర్ అని పోలీసులు భావిస్తున్నారు. నాటి ఉగ్రచర్యలో ఇతడి పాత్ర కీలకమని సమాచారం.
గతేడాది జూలై 1న ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీపై జరిగిన ఉగ్ర దాడిలో ఒక భారతీయురాలు, 16 మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడ్డ ఐదుగురు ఉగ్రవాదులను సిబ్బంది ఆదే సమయంలో కాల్చి చంపేశారు. దాడి జరిగినప్పటి నుంచీ ఇందుకు కారకులైన దాదాపు 50 మంది ఉగ్రవాదులను సిబ్బంది మట్టుబెట్టింది.