‘పీజీ ఉత్తీర్ణులు ఇంజినీరింగ్ పాఠాలు చెప్పొచ్చు’
విజయవాడ : ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ విద్యార్హత కలిగినవారు ఇంజినీరింగ్ పాఠ్యాంశాలను బోధించవచ్చని జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సోమవారం ప్రకటించింది. దీనిపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఏఐసీటీఈ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలోని సుమారు 20 వేల మంది అభ్యర్థులకు ఊరట కలిగింది. ఈ ఏడాది జనవరి 6వ తేదీన ఇంజినీరింగ్ చదువులకు ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ విద్యార్హత కలిగినవారికి బోధించే సామర్థ్యం లేదని ఏఐసీటీఈ ప్రకటించింది.
దీనిపై ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల్లో ఆయా విద్యార్హత కలిగిన ఫ్యాకల్టీలు రోడ్డున పడతారని, ఇటీవల నగరానికి వచ్చిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఇంజినీరింగ్ కళాశాలల ఫ్యాకల్టీ అసోసియేషన్ వినతి పత్రం సమర్పించింది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఏఐసీటీఈ సమావేశంలో ఎమ్మెస్సీ, ఎంసీఏ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఇంజినీరింగ్ పాఠ్యాంశాలను బోధించవచ్చని తీర్మానించింది. సంబంధిత వివరాలను ఏఐసీటీఈ వెబ్సైట్లో పొందుపరిచింది.