సౌరాష్ట్ర 192/8
ముంబైతో రంజీ ఫైనల్
పుణే: ధావల్ కులకర్ణి (4/30) రాణించడంతో రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలి రోజు ముంబై ఆధిపత్యం చలాయించింది. ఎంసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 84.4 ఓవర్లలో 8 వికెట్లకు 192 పరుగులు చేసింది. ధావల్ కొత్త బంతితో నిప్పులు చెరగడంతో ఓ దశలో సౌరాష్ట్ర 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. పుజారా (4) సహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. అర్పిత్ వసవాదా (214 బంతుల్లో 77; 6 ఫోర్లు) ఓ ఎండ్‌లో ఒంటరి పోరాటం చేసినా...రెండో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ అంతా క్యూ కట్టారు. దీంతో సౌరాష్ట్ర 108 పరుగులకు ఏడు వికెట్లతో కష్టాల్లో కూరుకుంది. ఈ దశలో కెరీర్లో తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడుతున్న బౌలర్ ప్రేరక్ మన్కడ్ (119 బంతుల్లో 55 బ్యాటింగ్; 5 ఫోర్లు) అసమాన ఆటతీరుతో వసవాదాకు అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 84 పరుగులు జోడించడంతో సౌరాష్ట్రకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ముంబై బౌలర్లలో ఠాకూర్ రెండు వికెట్లు తీసుకోగా... అభిషేక్ నాయర్, సంధు ఒక్కో వికెట్ పడగొట్టారు.