బ్రెజిల్ దేశాధ్యక్షుడి ప్యాలెస్‌లో దెయ్యం!
దేవుడా!
ఏ దేశాధ్యక్షుడికైనా దేశంలోని సమస్యలను మించిన దెయ్యాలు ఏముంటాయి? కానీ బ్రెజిల్ అధ్యక్షుడు మిషెల్ టెమెర్ దేశ సమస్యలకు భయపడడం లేదు. ఇంట్లోని దెయ్యాలకు వణికిపోతున్నారు! అమెరికా అధ్యక్షుడికి ‘వైట్ హౌస్’ ఎలాగో.. బ్రెజిల్ అధ్యక్షుడికి ‘ఆల్వొరాడా ప్యాలెస్’ అలాగ. ఆ ప్యాలెస్సే ఆయన నివాసం. అయితే కొన్నాళ్లుగా ప్యాలెస్‌లో ఏవో వింత శబ్దాలు వినిపిస్తూ టెమెర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు కంటి కునుకు లేకుండా చేస్తున్నాయి! టెమెర్ వయసు 76 ఏళ్లు. ఆయన అందాల భార్య (మాజీ బ్యూటీ క్వీన్) మార్సెలా వయసు 33 ఏళ్లు. వాళ్ల కొడుకు మిషెల్ జిన్హో వయసు 7 ఏళ్లు.
వయసులతో నిమిత్తం లేకుండా ఈ ముగ్గురూ దెయ్యాల భయంతో ప్యాలెస్‌లో ఒకర్నొకరు విడిచిపెట్టకుండా తిరుగుతున్నారు. రాత్రయిందంటే.. ఎవరు ఏ గదిలో ఉన్నా ఒకే గదికి చేరుతున్నారు! పిల్లవాడైతే నాన్న మీద ఒక కాలు, అమ్మ మీద ఒక కాలు వేసి పడుకుంటున్నాడు. టెమెర్కి దెయ్యాలంటే నమ్మకం లేదు. కానీ ఏదో దుష్టశక్తి తనను ఆవహిస్తున్నట్లు ఆయన గమనించారు! మార్సెలా మొదట పట్టించుకోలేదు కానీ, భర్తే స్వయంగా తనకేదో నీడలు కనిపిస్తున్నట్లు చెప్పడంతో భూతవైద్యుడిని ఇంటికి రప్పించారు. మంత్రం వేయించారు. అయినప్పటికీ ఆల్వొరాడా ప్యాలెస్‌లో అలికిడులు, దేశాధ్యక్షుడి మనసులోని అలజడులు తగ్గలేదు. దాంతో ఈ కుటుంబం రెండు రోజుల క్రితమే ఆల్వొరాడా ప్యాలెస్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయింది!
నిజానికి ఆల్వొరాడో ప్యాలెస్‌లో ఒక్కరోజైనా గడిపేందుకు ప్రపంచ దేశాల అధినేతలు సైతం ఉవ్విళ్లూరుతుంటారు. బ్రెజిల్ రాజధాని బ్రెజీలియాలోని ఒక ద్వీపకల్పంలో ప్రకృతి పంచన ఉన్నట్లుగా ఉంటుంది ఈ ప్యాలెస్. 1957లో ఆస్కార్ నీమియర్ అనే వాస్తుశిల్పి చక్కగా గాలీ వెలుతురూ వచ్చేలా అత్యాధునికంగా ఆల్వొరాడోను డిజైన్ చేశారు. అధ్యక్షుడి ప్రధాన శయనాగారంతో పాటు.. ఓ పెద్ద ఈతకొలను, ఫుట్‌బాల్ మైదానం, చిన్న ప్రార్థనాస్థలం, వైద్యకేంద్రం ఇందులో ఉన్నాయి.
ఇప్పుడు ఈ సదుపాయాలన్నిటినీ వదులుకుని అక్కడికి దగ్గర్లోనే ఉన్న జబురు ప్యాలెస్‌కు వెళ్లిపోయింది అధ్యక్షుడి కుటుంబం. జబురు ప్యాలెస్‌లో బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. మరి ఆయన ఎక్కడ సర్దుకున్నారో కానీ, ఈయన అక్కడకు అన్నీ సర్దుకుని వెళ్లిపోయారు. ఈ రెండు ప్యాలస్‌ల మధ్య దూరం అర కిలోమీటరు కన్నా ఎక్కువ ఉండదు. బ్రెజిల్ దేశాధ్యక్షుడిని నిజంగానే దెయ్యం వెంటాడుతున్నట్లయితే ఆ దెయ్యానికి అదేమంత పెద్ద దూరం కాబోదు.
బ్రెజిల్ దేశాధ్యక్షుడు మిషెల్ టెమెర్, ఆయన భార్య మార్సెలా, కొడుకు జిన్హో.
ఉపాధ్యక్షుడి అధికార నివాసం జబురు ప్యాలెస్
బ్రెజిల్ దేశాధ్యక్షుడి అధికార నివాసం అల్ వొరాడా ప్యాలెస్