అర్ధరాత్రి.. ఆగంతకులు
టైమ్ అర్ధరాత్రి 2..
చిమ్మచీకటి..
హైదరాబాద్ మహానగరం..
కొంతమంది ఒక్కసారిగా రోడ్డు మీదకొచ్చారు.. అందరూ మంకీ క్యాప్‌లు వేసుకున్నారు.. వాళ్ల కళ్లు చింతనిప్పుల్లా మండుతున్నాయి.. గుంపుగా బయల్దేరారు. వారు దేనికోసమో వెతుకుతున్నారు.. రోడ్డు మీద వెళ్తున్నారే గానీ.. వాళ్లు కళ్లు ఎక్స్‌రేలా పరిసరప్రాంతాలను జల్లెడ పట్టేస్తున్నాయి.. ఈ రోజు తమ టార్గెట్‌ను ఎలాగైనా పూర్తిచేయాలనే పట్టుదలతో ఉన్నారు వారు.. అదిగో టార్గెట్.. వాళ్ల కళ్లల్లో మెరుపు.. అందరూ గుంపుగా ఒక్కసారిగా ఉరికారు..
ఇంతకీ వీళ్లంతా ఉరికి ఏం చేశారు?? వెళ్లి.. ఏటీఎం ముందు లైను కట్టారు. సగటు నగరవాసి దుస్థితి ఇదీ..
చాలా ఏటీఎంల్లో డబ్బుల్లేక.. ఉదయం సమయంలో గంటలుగంటలు చేంతాళ్లను తలపించే క్యూలో నిల్చున్నా.. ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి వేళలో ఇలాంటి సన్నివేశాలు నిత్యకృత్యమవుతున్నాయి. నిద్రలు మానుకుని మరీ.. నగదు ఉన్న ఏటీఎంల వేటలో మునిగిపోతున్నారు. ఎవరైనా ఏటీఎం వద్ద కనిపిస్తే.. అక్కడ ఆగి ఆశగా చూడటం.. ‘భయ్యా.. డబ్బులున్నాయా’ అని ఆరాలు తీయడం కామన్‌గా మారింది. ఆ సమయంలో అయితే.. జనం తాకిడి తక్కువుంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. కొందరు యాప్‌ల సాయంతో.. మరికొందరు తెలిసిన వాళ్లను కనుక్కొని వెళ్తున్నారు. అర్ధరాత్రి డ్యూటీలు చేసే ఉద్యోగులు.. ఇప్పుడు ఇళ్లకు వెళ్లకుండా ఏటీఎంలకు వెళ్తున్నారు. అలాగనీ.. అర్ధరాత్రి కూడా ప్రతిసారి నగదు ఈజీగా దొరకని పరిస్థితి.. ఇదీ నగరవాసి దుస్థితి..
- సాక్షి తెలంగాణ డెస్క్
పరిస్థితి దుర్భరం..
ఆ మధ్య వరకూ కాస్తో.. కూస్తో.. రాత్రి పూట ప్రయత్నిస్తే.. దొరికేవి.. ఒకటో తారీఖు తర్వాత పరిస్థితి మరింత దుర్భరంగా మారింది.. ఎక్కడా దొరకడం లేదు. నేను అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని.. ఇంటికి వెళ్లకుండా ఏటీఎంల వేటలో మునిగిపోతున్నా.. అయినా దొరకడం లేదు..
- కిశోర్, ప్రైవేటు ఉద్యోగి, మెహిదీపట్నం..