ప్రమాణం చేయకముందే ఎమ్మెల్యే హఠాన్మరణం
పట్నా: బిహార్ శాసనసభకు తొలిసారి ఎన్నికైన ఆర్ఎల్ఎస్పీ ఎమ్మెల్యే బసంత్ కుమార్ సోమవారం గుండెపోటుతో మరణించారు. ఇటీవల ఛాతినొప్ప రావడంతో పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బసంత్ కుమార్.. ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. బసంత్ కుమార్ మృతిపట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు.
ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామి ఆర్ఎల్ఎస్పీ తరపున హర్లఖీ నియోజకవర్గం నుంచి బసంత్ కుమార్ గెలుపొందారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన మరణించడంతో విషాదం చోటు చేసుకుంది. బిహార్ కొత్త శాసనసభ తొలిసారిగా ఈ రోజు సమావేశమైంది. బసంత్ కుమార్ హఠాన్మరణం చెందడంతో ఈ రోజు జరగాల్సిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదాపడింది. ఆయన మృతికి సంతాపం సూచకంగా ఓ నిమిషం మౌనం పాటించిన అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఎమ్మెల్యేలు మంగళవారం ప్రమాణం చేస్తారని ప్రొటెం స్పీకర్ సదానంద్ సింగ్ ప్రకటించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీ తరపున ఇద్దరు మాత్రమే నెగ్గారు. బసంత్ కుమార్ మరణంతో శాసనసభలో ఆర్ఎల్ఎస్పీ బలం ఒకటికి పడిపోయింది. బిహార్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. జేడీయూ నేత నితీశ్ కుమార్ మంత్రివర్గంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు చేరాయి.