క్రీడలతో ఉజ్వల భవిష్యత్
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
రాష్ట్రస్థాయి అండర్–17 చెస్ టోర్నీ ప్రారంభం
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి రాష్ట్రంలో క్రీడలపై వివక్ష కొనసాగేదని, తెలంగాణ క్రీడాకారులను పట్టించుకోలేదని, ప్రత్యేక రాష్ట్రంలో అన్ని క్రీడలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్–17 చెస్ చాంపియన్‌షిప్ పోటీలను స్థానిక జాలీహిల్స్‌లో శనివారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రా పాలకులు పేర్లు, ప్రాంతాల బట్టి క్రీడాకారులను ఎంపిక చేసేవారని ఆరోపించారు. క్రీడలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. నైపుణ్యం గల క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించేవారికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. పాఠశాలల్లో క్రీడలు ఆడుకోవడానికి స్థలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు, ర్యాంకులు అంటూ తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి పెంచి మానసిక వికాసానికి దూరం చేస్తున్నారని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం కూడా ముఖ్యమేనన్నారు. ప్రతి జిల్లాలో స్టేడియం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాస్టేడియంలో అభివృద్ధి పనులకు రూ.2.50కోట్లు మంజూరయినట్లు వెల్లడించారు. త్వరలో ఎంపీతో కలిసి ఇండోర్‌స్టేడియం ఏర్పాటు కోసం సీఎం దృష్టికి తీసుకెళుతామన్నారు. రాష్ట్ర చెస్ అసోసియేషన్ కోశాధికారి అంజయ్య మాట్లాడుతూ చెస్ క్రీడపై చిన్నచూపు చూడవద్దని కోరారు. శాప్, ఒలింపిక్స్ అసోసియేషన్‌లో చెస్‌కు ప్రాధాన్యత ఇచ్చి, సహకరించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే చెస్ ఆడి టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ ప్యాట్రన్ నటరాజ్, అధ్యక్ష, కార్యదర్శులు రామలక్ష్మయ్య, ప్రవీణ్‌కుమార్, కరుణాకర్, జాలీహిల్స్ యజమాని విజయనారాయణరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కృష్ణ, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.
తొలిరౌండ్ విజేతలు..
రాష్ట్రస్థాయి చెస్ టోర్నీలో 60 మంది బాలురు, 40 మంది బాలికలు పాల్గొంటున్నారు. స్విస్‌లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరౌండ్లో రేటింగ్ క్రీడాకారులు రాధాకృష్ణ(మహబూబ్‌నగర్)పై సుశీల్‌రెడ్డి (హైదరాబాద్), కిరణ్ (మహబూబ్‌నగర్)పై మేఘనాష్రాం (రంగారెడ్డి), కిరణ్‌కుమార్ (మహబూబ్‌నగర్)పై సంజయ్‌భార్గవ్ (నల్లగొండ), అఖిల్ (ఖమ్మం)పై ప్రణవ్ (హైదరాబాద్) గెలుపొందారు. బాలికల విభాగంలో లయ (మహబూబ్‌నగర్)పై సుష్మారెడ్డి (కరీంనగర్), సాయిప్రియ (హైదరాబాద్)పై సాయిశ్రీజ (రంగారెడ్డి), నిత్య (హైదరాబాద్)పై దీక్షిత (రంగారెడ్డి)పై విజయం సాధించారు.