Money transaction
-
నగదు లావాదేవీల సమాచారమివ్వండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..అక్రమ డబ్బు రవాణాను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాతాదారులు ఎవరైనా రూ.లక్ష కంటే ఎక్కువ డిపాజిట్, విత్ డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలకు పైగా నగదును ఖాతాదారుడు తీసుకున్నా జిల్లా ఎన్నికల అధికారికి, ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారికి తెలపాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం తన పేరుతో లేదా ఏజెంట్ పేరుతో కలిపి బ్యాంకు, పోస్టాఫీసుల్లో ప్రత్యేకంగా అకౌంట్ లేదా ఉమ్మడి అకౌంట్ తెరవవచ్చని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు తెరవాలని అన్ని బ్యాంకులకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
డిజిటల్ చెల్లింపుల జోరు
చెన్నై: దేశీయంగా గతేడాది డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిల్చింది. 2022లో 65 బిలియన్ డాలర్ల విలువ చేసే 2.9 కోట్ల లావాదేవీలతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. పేమెంట్ సర్వీసుల సంస్థ వరల్డ్‌లైన్ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం న్యూఢిల్లీ (1.96 కోట్ల లావాదేవీలు, 50 బిలియన్ డాలర్ల విలువ), ముంబై (1.87 కోట్ల లావాదేవీలు, 49.5 బిలియన్ డాలర్ల విలువ), చెన్నై (1.43 కోట్ల లావాదేవీలు, 35.5 బిలియన్ డాలర్ల విలువ), పుణే (1.5 కోట్ల లావాదేవీలు, 32.8 బిలియన్ డాలర్ల విలువ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అద్భుతమైన పురోగతి నమోదవుతోందని వరల్డ్‌లైన్ ఇండియా సీఈవో రమేష్ నరసింహన్ తెలిపారు. దేశీయంగా నగదు చలామణీని తగ్గించే దిశగా చెల్లింపులకు సంబంధించి బహుళ సాధనాలు అందుబాటులోకి రావడం మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. -
UPI Fraud: దెబ్బకు రూ. 35 లక్షలు గోవింద: ఎక్కడంటే?
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. మోసాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. యుపిఐ వినియోగంలోకి వచ్చిన తరువాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే కొంతమంది కేటుగాళ్లు ఈ UPIలో కూడా భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. నివేదికల ప్రకారం, ఇటీవల గురుగ్రామ్‌కు చెందిన పారావియమ్ టెక్నాలజీస్ ఇలాంటి యుపిఐ మోసానికి గురైనట్లు తెలిసింది. సైబర్ నేరగాళ్లు కంపెనీ పేమెంట్ గేట్‌వే సిస్టమ్‌ను తారుమారు చేసి ఏకంగా రూ. 35 లక్షలు దోచేశారు. కంపెనీ ఉపయోగించుకుంటున్న క్యాష్‌ఫ్రీ పేమెంట్ గేట్‌వేని తారుమారు చేసి డబ్బు దోచుకున్నట్లు సంస్థ ఆపరేషన్స్ హెడ్ అంకిత్ రావత్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. నిజానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్లు 95,000 యుపిఐ మోసాలకు పాల్పడినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కావున తప్పకుండా యుపిఐ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. లేకుంటే భారీ మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. యుపిఐ మోసాల నుంచి తప్పించుకోవడం ఎలా? మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓటిపి, పిన్ వంటి సమాచారాలను ఎప్పుడు, ఎవరితోనూ పంచుకోకూడదు. అమౌంట్ తీసుకోవడానికి మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రమే పిన్ అవసరం. డబ్బు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు వారి వివరాలను తప్పకుండా కన్ఫర్మ్ చేసుకోవాలి. యుపిఐ ఉపయోగిస్తున్నప్పుడు పబ్లిక్ నెట్‌వర్క్‌లను ఉపయోగించడం మానుకోవాలి. -
ఈ బ్యాంకింగ్ సేవలు ఫ్రీ కాదండోయ్.. లిమిట్ దాటితే బాదుడే!
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ప్రతీ ఒకరికి ఉంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇటీవల కాలంలో బ్యాంక్ సంస్థలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తమ సేవలను అందిస్తున్నాయి. అయితే నగదు లావాదేవీల ఎస్ఎంఎస్(SMS), ఐఎంపీఎస్(IMPS) ఫండ్ బదిలీ, చెక్ క్లియరెన్స్ , ఏటీఎం విత్డ్రాల్ ఇలా ఏ సౌకర్యం పూర్తిగా ఉచితం కాదు. అన్ని సేవలకు, బ్యాంక్ నిబంధనల అనుసరించి తమ కస్టమర్ల నుంచి కొంత ఛార్జీని వసూలు చేస్తుంది. ఇది తెలియక మన జేబులో పైసలు చార్జీల రూపంలో బ్యాంక్‌లకు కడుతున్నాం. ఓసారి ఆ సేవల గురించి తెలసుకుందాం. నగదు లావాదేవీ బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరు నగదు లావాదేవీలు చేయడం సహజం. అయితే ఈ లావాదేవీని నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే చేయవచ్చు. మీరు నిర్ణీత పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే, దానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీ ప్రతి బ్యాంకుకు దాని నిబంధనల ప్రకారం మారుతూ ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ బ్యాంకులో 20 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్‌ను నిర్దిష్ట పరిమితి వరకు నిర్వహించాలి. మీ ఖాతాలో అంత కంటే తక్కువ మొత్తం ఉన్నట్లయితే, కనీస బ్యాలెన్స్ లేని కారణంగా ఛార్జ్ చెల్లించాలి. అన్ని బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్, దానిని నిర్వహించనందుకు ఛార్జీల పరిమితి భిన్నంగా ఉంటాయి. ఐఎంపీఎస్ ఛార్జీలు అన్ని బ్యాంకులు నెఫ్ట్( NEFT), ఆర్టీజీఎస్( RTGS) లావాదేవీలను కస్టమర్లకు ఉచితంగా అందిస్తాయి. అయితే చాలా బ్యాంకులు ఇప్పటికీ ఐఎంపీఎస్( IMPS ) లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీ రూ.1 నుంచి రూ.25 వరకు ఉంటుంది. లక్ష వరకు ఓకే మీ చెక్కు రూ. 1 లక్ష వరకు ఉంటే, మీరు బ్యాంకుకు ఎటువంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే క్లియరెన్స్ ఛార్జీని చెల్లించాలి. మరోవైపు, చెక్కుల విషయంలోనూ పరిమితి సంఖ్య వరకు ఉచితంగా ఇస్తారు. అంతకు మించి చెక్కుల కావాలంటే వాటికోసం మీరు ధర చెల్లించాలి. ఏటీఎం లావాదేవీ ఏటీఎం (ATM) నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా నిర్ణీత సమయం వరకు మాత్రమే ఉచితంగా లభిస్తుంది. పేర్కొన్న సంఖ్య కంటే ఎక్కువ లావాదేవీల జరిపితే అప్పటి నుంచి చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాంకు వసూలు చేసే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఇందుకు చాలా బ్యాంకులు రూ.20-50 వరకు వసూలు చేస్తున్నాయి. ఎస్ఎంఎస్ కూడా ఫ్రీ కాదండోయ్ మీ ఖాతాలో డబ్బు క్రెడిట్ అయినప్పుడు లేదా డెబిట్ అయినప్పుడు బ్యాంక్ మీకు ఎస్ఎంఎస్ పంపుతుంది. దీనికి బ్యాంకులు కూడా ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ చాలా మందికి దీని గురించి తెలియదు ఎందుకంటే ఈ ఛార్జీ చాలా తక్కువగా ఉంటుంది. వివిధ బ్యాంకులకు ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. డెబిట్ కార్డు పోతే.. పైసలే మీరు మీ డెబిట్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, మీరు మరొక కార్డును పొందడానికి ఛార్జీ చెల్లించాలి. ఈ ఛార్జీ రూ. 50 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో ఛార్జీలను నిర్దేశించింది. చదవండి: టైం వచ్చింది వెళ్దాం.. ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ చేస్తున్న ఎయిరిండియా -
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు గట్టి షాక్.. రెడీగా ఉండండి!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రతిదీ డిజిటల్లోకి మారుతోంది. నోట్ల రద్దు నాడు మొదలైన డిజిటల్ ట్రెండ్ ముఖ్యంగా కరోనా రాకతో డబ్బులు మార్పిడి తగ్గి ఫటా ఫట్‌మంటూ యూపీఐ లావాదేవీల వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇదేదో బాగుందనుకుని అప్పటి నుంచి నగదు లావాదేవీల కొరకు ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌లను తెగ వాడుతున్నారు. ఎంతలా అంటే చిన్న షాపు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులు మొత్తం యూపీఐ ద్వారానే జరగుతున్నాయి. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ, ఫ్రీగా లావాదేవీలకు అలవాటు పడిపోయిన వారికి కేంద్రం గట్టి షాక్ ఇవ్వబోతోంది. ఇకపై యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో ఫీజులు, ఛార్జీలు విధించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 3 లోపు ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను కోరింది. సాధారణంగా క్రెడిట్ కార్డు వాడితే ఎండీఆర్(MDR) ఛార్జీలు వేస్తారు. దీన్ని బ్యాంకులతో పాటు కార్డు జారీ కంపెనీలు పంచుకుంటాయి. ఇదే తరహాలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తే, సంబంధిత సంస్థలు మరింత సమర్ధంగా సేవలు అందిస్తాయని ఆర్బీఐ యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే యూపీఐ యాప్‌లను వినియోగించే వారికి పెద్ద షాక్ తగలనుంది. దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫాంగా యూపీఐ పేరు సంపాదించింది. నగదు బదిలీలతో పాటు వ్యాపార చెల్లింపులు కలిపి ప్రతి నెలా 6 బిలియన్ల లావాదేవీలు, రూ. 10 ట్రిలియన్ల వరకు లావాదేవీలు యూపీఐ ద్వారానే జరగుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం 2022 మొదటి త్రైమాసికంలో 64%, విలువ పరంగా 50% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి చదవండి: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ ప్రయాణం, వచ్చేస్తోంది! -
డిజిటల్ చెల్లింపుల్లో 29 శాతం వృద్ధి
ముంబై: దేశ వాసులు డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా రాకతో కరెన్సీ నోట్ల వినియోగం తగ్గడం, అదే సమయంలో సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపుల సాధనాలు (యూపీఐ ఆధారిత) అందుబాటులోకి రావడం ఇందుకు అనుకూలిస్తోంది. డిజిటల్ చెల్లింపులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 29 శాతం వృద్ధి చెందినట్టు ఆర్బీఐ డేటా తెలియజేస్తోంది. ఆర్బీఐ కొత్తగా రూపొందించిన డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ (ఆర్బీఐ–డీపీఐ) 2022 మార్చి చివరికి 349.3గా ఉంది. 2021 సెప్టెంబర్‌కు ఇది 304.06, 2021 మార్చి నాటికి 270.59గా ఉండడం గమనార్హం. డిజిటల్ చెల్లింపులకు ఆమోదం ఎంతో వేగంగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని ఆర్బీఐ పేర్కొంది. చదవండి: Realme Pad X Tablet: రియల్మీ కొత్త టాబ్లెట్.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ.. -
‘‘పాన్’’ కంపల్సరీ.. కాదంటే కుదరదు..
రాను రాను పర్మనెంట్ అకౌంట్ నంబర్ లేకపోయినా, వాడకపోయినా, పేర్కొనకపోయినా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఎన్నోసార్లు మనం ప్రస్తావించాం. ఏయే సందర్భాల్లో పాన్ని తెలియజేయాలో .. ఇప్పుడు అదే దిశలో ఆదాయపు పన్ను శాఖ మరో పెద్ద ముందడుగు వేసింది. మే 10వ తేదీన ఒక నోటిఫికేషన్ వచ్చింది. అందులో పేర్కొన్న నిబంధనలు త్వరలోనే అమల్లోకి వస్తాయి. ఆ మార్పులు, చేర్పుల సారాంశం ఏమిటంటే .. కొన్ని నిర్దేశిత వ్యవహారాలకు నిర్దిష్ట పరిమితులను పొందుపర్చారు. ఆ లావాదేవీలు చేసే ముందు విధిగా పాన్ లేదా ఆధార్ గురించి ప్రస్తావించాలి. ఈ లావాదేవీలు ఏ సంస్థతో జరుపుతారో ఆ సంస్థ పాన్ / ఆధార్‌తో పాటు ఆ వ్యక్తి యొక్క ‘‘వివరాలు’’ (ఉదాహరణకు వయస్సు, లింగభేదం, చదువు, జాతీయత, మతం మొదలైనవి) అడిగే అవకాశం ఉంది. డెమోగ్రాఫిక్ సమాచారంలో అన్ని వివరాలు అడగవచ్చు. బయోమెట్రిక్ సమాచారం కూడా అడుగుతారు. అంటే సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలు ఏమిటంటే.. - ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు లేదా ఇతర డిపాజిట్లకు సంబంధించి ఒకటి లేదా ఎన్ని బ్యాంకు ఖాతాల్లోనైనా లేదా పోస్టాఫీసులో రూ. 20,00,000 లేదా అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే, డిపాజిట్‌దారు పాన్/ఆధార్ సంఖ్య వేయాలి. పుచ్చుకున్న బ్యాంకు/పోస్టాఫీసు ముందుగా పేర్కొన్నట్లు ఆదాయపు పన్ను శాఖలోని ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారాన్ని అందించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక బ్రాంచ్ కాదు.. ఒక బ్యాంకు కాదు అన్ని బ్యాంకుల్లోనూ ఎక్కడ డిపాజిట్ చేసినా ఈ రూలు వర్తిస్తుంది. - ఇదే మాదిరిగా బ్యాంకు నుంచి, పోస్టాఫీస్ నుంచి మనం చేసే విత్‌డ్రాయల్స్, అకౌంట్ నుంచి .. ఒకసారి కాదు అనేక దఫాలుగా ఒక ఆర్థిక సంవత్సరంలో తీసినది, డెబిట్ అయినది, నగదు విత్‌డ్రాయల్ కాకుండా చెక్, బదిలీ ద్వారా విత్‌డ్రా చేసినది ఇలాంటి వాటన్నింటికీ కలిపి మొత్తం పరిమితి రూ. 20,00,000గాఉంటుంది. ఇటువంటి సందర్భంలోనూ అవే రూల్సు వర్తిస్తాయి. - బ్యాంకులో కరెంటు అకౌంటు తెరిచినా, క్యాష్ క్రెడిట్ అకౌంటు తెరిచినా, అలాగే పోస్టాఫీసులో కరెంటు ఖాతా తెరిచినా ఎటువంటి పరిమితులు లేవు. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయి. తగిన జాగ్రత్త వహించి అడుగేయండి. ఎన్ని నిబంధనలు ఎంత కఠినంగా అమలుపర్చినా మీ డిపాజిట్లకు సరైన ‘‘సోర్స్’’ ఉంటే .. సరిలేరు మీకెవ్వరు. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్..! ఫిబ్రవరి 1 నుంచి..!
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్..! ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచుతోంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. కొత్త ఛార్జీలు..! డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రొత్సహించేందుకుగాను ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యోనో బ్యాంకింగ్ ద్వారా రూ. 5 లక్షల వరకు ఐఎంపీఎస్ సేవలకు ఎలాంటి సర్వీస్ ఛార్జ్, జీఎస్టీ వర్తించదు. బ్యాంకుల్లో చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఐఎంపీఎస్ ఛార్జీని అమలు చేయనున్నట్లు ఎస్బీఐ తమ ఖాతాదారులను ఇప్పటికే అలర్ట్ చేసింది. ఐఎంపీఎస్ ద్వారా ఖాతాదారులు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పంపితే రూ. 20తో పాటుగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది. ఐఎంపీఎస్ సేవలతో డబ్బులను ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాకు సెకన్లలో బదిలీ చేయవచ్చును.సెలవు దినాలలో కూడా నగదు బదిలీ జరుగుతుంది. కొత్త ఛార్జీలు ఇలా ఉన్నాయి..! రూ. 5 లక్షల వరకు ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే ఏదైనా ఐఎంపీఎస్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. వీటిలో యోనో యాప్ లావాదేవీలకు కూడా వర్తించనుంది. ఐఎంపీఎస్ లావాదేవీల్లో భాగంగా రూ.1,000 నుంచి రూ.10,000 వరకు బదిలీ చేస్తే రూ. 2తో పాటు జీఎస్టీ చెల్లించాలి. రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు ఐఎంపీఎస్ లావాదేవీపై రూ. 4తో పాటుగా జీఎస్టీ చెల్లించాలి. రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు జరిపే లావాదేవీలపై రూ.12తో పాటు జీఎస్టీని ఛార్జ్ చేయనుంది. తాజాగా ఎస్బీఐ రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు కొత్త స్లాబ్‌ను యాడ్ చేసింది. ఈ నగదు లావాదేవీలపై రూ. 20 పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: ఎస్బీఐ కొత్త సర్క్యులర్.. ఒక్క నోటీసుతో సీన్ రివర్స్, వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన -
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్..!
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్..! లావాదేవీలను మరింత సులువు చేస్తూ సరికొత్త పేమెంట్ పద్దతులను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. మొబైల్లో ఇంటర్నెట్ డేటా లేకుండా క్షణాల్లో లావాదేవీలను జరిపే ఫీచర్‌ను పేటీఎం తీసుకొచ్చింది. ట్యాప్ టూ పే... ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ‘ట్యాప్ టూ పే’ సేవలను ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో యూజర్లు సులువుగా మనీ ట్రాన్సక్షన్లను జరపవచ్చునని పేటీఎం తెలిపింది. ఈ ఫీచర్‌తో యూజర్లు వారి పేటీఎం రిజిస్టర్డ్ కార్డ్ ద్వారా పీఓఎస్ మెషీన్లో వారి ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా తక్షణ చెల్లింపులను చేయడానికి వీలు కల్పించనుంది. యూజర్ల ఫోన్ లాక్‌లో ఉన్న, లేదా మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా నగదు లావాదేవీలను పూర్తి చేయవచ్చును. ఈ సదుపాయం ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. వివరాలు బహిర్గతం కావు..! ట్యాప్ టు పే ఫీచర్లో భాగంగా...సెలెక్ట్‌డ్ డెబిట్ కార్డ్‌లోని 16-అంకెల ప్రైమరీ అకౌంట్ నంబర్‌ను సురక్షిత లావాదేవీ కోడ్ లేదా 'డిజిటల్ ఐడెంటిఫైయర్'గా మార్చనుంది. ఈ డిజిటల్ ఐడెంటిఫైయర్‌లో యూజర్ల కార్డ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ వ్యక్తులతో బహిర్గతం కాదు. ఒక యూజర్ రిటైల్ అవుట్‌లెట్‌ను సందర్శించినప్పుడు...కార్డ్ వివరాలను బహిర్గతంచేయకుండా ఉండేందుకు పీఓఎస్ మెషిన్ దగ్గర ట్యాప్ చేసి పేమెంట్ చేయవచ్చును. రిటైల్ స్టోర్లలో వేగవంతమైన చెల్లింపు లావాదేవీలను సులభతరం చేయడంతో పాటుగా, ఈ సదుపాయం పేటీఎం పీఒఎస్ పరికరాలతో పాటు ఇతర బ్యాంకుల పీఓఎస్ మెషీన్లకు కూడా వర్తించనుంది. తాజా ఫీచర్‌తో ఎన్ఎఫ్సీ(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) లావాదేవీలను కూడా జరపవచ్చును. చదవండి: ఈ బ్యాంకులు దివాలా తీయవ్ ! ఆర్బీఐ కీలక ప్రకటన -
చనిపోయిన భర్త అకౌంట్ నుంచి రూ.34 లక్షలు మాయం
సాక్షి,హిమాయత్‌నగర్: ఇటీవల కోవిడ్‌తో చనిపోయిన తన భర్త అకౌంట్ నుంచి డబ్బులు మాయమైనట్లు మెహదీపట్నంకు చెందిన నజియా సోమవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చనిపోయిన సమయంలో భర్త ఫోన్, వాలెట్ కనిపించలేదని, అదే సమయంలో హాస్పిటల్‌కు ఖర్చు బెట్టిన డబ్బులను లెక్క చూసేందుకు బ్యాంకు స్టేట్మెంట్ నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూస్తుండగా.. భర్త అకౌంట్లో నుంచి రూ.34లక్షల నగదు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు స్పష్టమైంది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నజియా పోలీసులను ఆశ్రయించింది. లాటరీ పేరుతో రూ.2లక్షలు.. మీకు ఖరీదైన కారు బహుమతిగా వచ్చిందంటూ వట్టపల్లికి చెందిన అజారుద్దీన్‌కు స్నాప్‌డీల్ నుంచి ఫోన్ వచ్చింది. ఇందుకు గాను మీరు రూ.2లక్షలు చెల్లించాలని పేర్కొన్నాడు. దీంతో ఖరీదైన కారు ఉచితంగా వస్తున్నప్పుడు రూ.2లక్షలు పెద్ద విషయం కాదంటూ అతడు చెప్పిన బ్యాంకు ఖాతా లకు బదిలీ చేశాడు. రోజులు గడుస్తున్నా కారు ఇవ్వకపోగా.. ఫోన్లో స్పందన లేకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఫ్రెండే కదా అని రూ.2లక్షలు పంపాడు.. యూఎస్‌లో ఉంటున్న రమేష్ అనే స్నేహితుడి నుంచి బంజారాహిల్స్‌కు చెందిన సురేష్‌బాబుకు మెసేజ్ వచ్చింది. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నాను ఈ మెసేజ్‌లో ఉన్న బ్యాంకు అకౌంట్‌కు రూ.2లక్షలు పంపమన్నాడు. స్నేహితుడే కదా అని ఏ మాత్రం క్రాస్‌చెక్ చేసుకోకుండా అడిగిన రూ.2లక్షలను సురేష్‌బాబు ఆ బ్యాంకు ఖాతాలకు పంపడం జరిగింది. ఆ తర్వాత రమేష్‌న ఫోన్లో అడగ్గా.. నేనేమీ నిన్ను అడగలేదని, నువ్వు ఎవరికి పంపావో నాకు తెలీదనే సమాధానం ఇచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించి సురేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
3 ఏటీఎంలు.. 7 రోజులు.. రూ. 19 లక్షలు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో మూడు ఏటీఏంలలో కలిపి సుమారు 89 మంది అకౌంట్ల నుంచి దాదాపు రూ. 19 లక్షల వరకు విత్ డ్రా చేశారు. ఈ సంఘటనలన్ని తిలక్ నగర్ ఏరియా పరిధిలోనే జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ఈ నెల ఒకటవ తేదీన తిలక్ నగర్ ఏరియాలో మొదటి ఫిర్యాదు నమోదయ్యింది. తన ఏటీఎం నుంచి తనకు తెలియకుండానే డబ్బు విత్‌డ్రా అయినట్లు ఓ వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేశాడు. రెండు మూడు రోజుల్లోనే బాధితుల సంఖ్య పెరగడంతో ఈ కేస్‌ను సీరియస్‌గా తీసుకున్నాం’ అన్నారు. ఆ అధికారి మాట్లాడుతూ.. ‘ఒకే ఏటిఎం నుంచి సొమ్ము విత్‌డ్రా అవుతున్నట్లు గుర్తించిడంతో.. దీని వెనక ఓ గ్యాంగ్ ఉన్నట్లు భావించాం. ఓ వైపు ఈ కేసుల గురించి దర్యాప్తు కొనసాగుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఈ సారి మరో రెండు ఏటీఎంల నుంచి కూడా సొమ్ము డ్రా చేసినట్లు మా దృష్టికి వచ్చింది. మొత్తం వారం రోజుల వ్యవధిలో 89 మంది అకౌంట్ల నుంచి దాదాపు రూ. 19 లక్షల సొమ్ము డ్రా చేసినట్లు గుర్తించా’మని సదరు అధికారి తెలపారు. అంతేకాక నిందితులు ఏటీఎంలలో స్కిమ్మింగ్ మెషన్లను అమర్చడం ద్వారా ఈ నేరాలకు పాల్పడుతుండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రోమానియాకు చెందిన కార్డ్ క్లోనింగ్ గ్యాంగ్ ఈ నేరాలకు పాల్పడుతుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ సైబర్ బృందం ఈ కేసును చేధించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓ బాధితుడు మాట్లాడుతూ.. ‘నేను ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సక్షన్లు చేయ్యను. నాకు నా అకౌంట్ నుంచి దాదాపు 50 వేల రూపాయలు విత్‌డ్రా చేశారు. ఇందుకు సంబంధించి నాకు ఎలాంటి ఫోన్ కానీ.. మెసేజ్ కానీ రాలేద’ని తెలిపారు. -
కొందరికే.. పెట్టుబడి
సాక్షి, జనగామ: యాసంగి పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. మొదటి దఫా డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వ్యవసాయశాఖ అధికారులు జమ చేశారు. మొదటి దఫాలో కేవలం 3,915 మంది రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేశారు. రెండో విడత చెల్లింపు ల కోసం రైతుల ఖాతా నంబర్లు సేకరిస్తున్నారు. ముం దస్తు ఎన్నికల నేపథ్యంలో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని నగదు రూపంలో చెల్లిం చడానికి వీలులేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిం ది. దీంతో చెక్కుల రూపంలో కాకుండా రైతుల అకౌంట్లలో పెట్టుబడి సా యం జమ చేయాలని సూచించడంతో ఈ మేరకు అధికా రులు చెల్లింపుల ప్రక్రియను చేపట్టారు. తొలి విడతలో రూ.4.65 కోట్లు జమ.. ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించడానికి రైతుబంధు పథకానికి ప్రభుత్వం శ్రీకా రం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో తొలివిడత రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. రెండో పంటకు అక్టోబర్‌లో చెక్కులను అందించాల్సి ఉండగా ఇంతలో శాసనసభను రద్దు చేశారు. ఎన్నికల కోసం సన్నాహాలు జరుగుతుండడంతో రైతుబంధు చెక్కులను పంపిణీని నిలిపివేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేరుగా రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి దఫాలో 13 మండలాల్లోని 3,915 మంది రైతులకువారి అకౌంట్లలో రూ.4,65,69,240 ను జమ చేశారు. రెండో విడతలో రూ.26.82 కోట్లు..మొదటి దఫాలో తక్కువ మంది రైతులకే పెట్టుబడి సాయం జమ చేశారు. నవంబర్ మొదటివారంలో రెండో దఫా పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్నారు. ఇందులో 22,109 మంది రైతులకు పెట్టుబడి సాయం అందజేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారికి రూ.26,82,52,460 చెల్లించనున్నారు. అకౌంట్ల సేకరణకు ఇక్కట్లు.. రైతుల బ్యాంకు అకౌంట్ల సేకరణలో అధికారులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలోని 68 క్లస్టర్లల్లో ఏఈఓలు ఇంటింటా రైతు వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా, మండలం, గ్రామం, రైతు పేర్లతోపాటు ఆధార్ నంబర్, బ్యాంకు, బ్రాంచి, అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్‌లతోపాటు 9 అంశాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఏఈఓలు గ్రామాలకు వెళ్తున్నప్పటికీ రైతులు అందుబాటులో లేకపోవడంతో వివరాలు సేకరించలేక పోతున్నారు. ఖరీఫ్‌లో 6,829 చెక్కులు వాపస్.. జిల్లావ్యాప్తంగా 1,54,658 చెక్కులు రైతుల పేరుమీద వచ్చాయి. అయితే వివిధ కారణాలతో ప్రభుత్వం తిరిగి 6,829 చెక్కులను తీసుకుంది. మిగతా 1,47,823 చెక్కుల్లో 1,32,870 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 75 వేల మంది రైతుల ఖాతాలను సేకరించారు. మరో 50 వేల మంది రైతుల వివరాలు తీసుకోవాల్సి ఉంది. రైతుల వివరాలు లేకపోతే రైతుబంధు సాయాన్ని జమ చేయడం మరింత ఆలస్యం కానుంది. 75 వేల ఖాతాలను సేకరించాం యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని మొదటి విడత రైతుల అకౌంట్లలో జమ చేశాం. రెండో విడత కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 75 వేల అకౌంట్లను సేకరించాం. మిగతా రైతుల వివరాలను సేకరిస్తున్నాం. అందరికి డబ్బులు వచ్చేలా ప్రయత్నిస్తాం. –ఎన్.వీరూనాయక్, డీఏఓ -
7 వేలకు బదులు 7 కోట్లు అకౌంట్లోకి.. కానీ!
⇔ కోట్ల డబ్బు అకౌంట్లో పడటంతో విద్యార్థిని జల్సాలు లండన్: అదృష్టం వెనుక డోర్ నుంచి వస్తే.. దురదృష్టం ఫ్రంట్ డోర్ తెరిచినట్లయింది ఓ విద్యార్థిని పరిస్థితి. చివరికి ప్రాణభయంతో పోలీస్ స్టేషన్ కు ఆమె పరుగులు తీశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. యూకేలోని వాల్టర్ సిసులు యూనివర్సిటీలో దక్షిణాఫ్రికాకు చెందిన సిబాంగైల్ మణి(27) అనే విద్యార్థిని చదువుకుంటున్నారు. ఆమెకు ఓ యూకే కంపెనీ నుంచి చదువు నిమిత్తం లోన్ కింద 85 పౌండ్లు అందజేసేది. ఈ క్రమంలో ఈనెల నగదు రూ. 7,113 (85 పౌండ్లు)కు బదులుగా 7.11 కోట్ల రూపాయలు (8.5లక్షల పౌండ్లు) ఆమె బ్యాంకు ఖాతాలో జమ కావడం స్థానికంగా కలకలం రేపింది. ఓ సిబ్బంది తప్పిదం కారణంగా సిబాంగైల్ మణి ఖాతాలోకి పదివేల రెట్లు అధికంగా డబ్బు జమైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అయితే జరగాల్సిన నష్టం అంతలోనే జరిగిపోయింది. స్కాలర్ షిప్ సంస్థ అధికారులు, కాలేజీ సిబ్బంది ఆమెను ప్రశ్నించేలోగానే.. ఆ విద్యార్థిని విచ్చలవిడిగా ఖర్చుచేశారు. దుస్తులు, కొన్ని ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా మద్యం సేవించేందుకు ఆమె రూ. 41.8 లక్షలు (50,000 పౌండ్లు) ఖర్చుచేసినట్లు తేలింది. నగదు మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ అందరూ చెప్పినా.. మణి పట్టించుకోలేదు. ఆమెపై చోరీతో పాటు చీటింగ్ చేసిన ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. దీంతో తోటి విద్యార్థులు, సంస్థ సిబ్బంది ఆమెపై దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో బాధిత విద్యార్థిని సిబాంగైల్ మణి రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసినట్లు సమాచారం. ఆమె నుంచి పూర్తి నగదును రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.