మంత్రి వర్సెస్ ఎంపీపీ
గుంటూరు వెస్ట్ : రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు రూరల్ ఎంపీపీ తోట లక్ష్మీకుమారి మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలాయి. ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వైషమ్యాలు భగ్గుమన్నాయి. వివరాలిలా ఉన్నాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాలులో బుధవారం సాయంత్రం ప్రత్తిపాడు నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు అని చెప్పటంతో నియోజకవర్గంలోని నాయకులు సమావేశానికి వచ్చి మధ్యాహ్నం వరకూ వేచిఉండి వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రం సమావేశం అని చెప్పడంతో తిరిగి వచ్చారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు తమ మండలాలలో సమస్యల చెబుతుండగా రూరల్ మండల ఎంపీపీ మండలంలోని సమస్యలను ప్రస్తావించేందుకు మంత్రి అనుమతి కోరారు. దీంతో మంత్రి నువ్వు చెప్పే సమయం చాలా ఉంది... ముందు అరవకుండా కూర్చోమని గద్దించారు. దీంతో ఎంపీపీ, మంత్రి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అనే స్థాయిలో వాదులాట జరిగింది. మంత్రి అర్ధాంతరంగా సమీక్షను నిలిపివేసి సమావేశ మందిరం వెనుక వైపు నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహావేశాలతో గుంటూరు రూరల్ మండల ఎంపీపీ అనుచరులు ఒక్కసారిగా మంత్రి అనుచరుల పైకి దాడిచేశారు. నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. విషయం మీడియా వారికి తెలియడంతో మీడియా ప్రతినిధులు వస్తున్నారని తెలిసి ఇరువర్గాల అనుచరులు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు.