సాక్షి స్పెల్‌బీకి విశేష స్పందన
వైవీయూ, న్యూస్‌లైన్: కడపలోని ప్రభుత్వ పురుషుల కళాశాల ఆడిటోరియల్ ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ఆదివా రం నిర్వహించిన ఇండియా స్పెల్ బీ జోనల్ స్థాయి కాంపిటీషన్‌కు విశేష స్పందన లభించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి తరలివచ్చిన విద్యార్థులను నాలుగు కేటగిరీలుగా విభజించి నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతం గా ముగిసింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ పురుషుల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రవికుమార్ మాట్లాడారు. పోటీ పరీక్షల విధానంలో స్పెల్‌బీని నూతన విప్లవంగా ఆయన అభివర్ణించారు. అనంతరం పరీక్షను ప్రారంభించారు. ‘సాక్షి’ ఛానల్లో ప్రత్యక్ష ప్రసార విధానంలో స్పెల్ బీ ప్రతినిధి స్పెల్లింగ్స్ చెబుతుండగా వారికి స్పెల్ బీ స్థానిక ప్రతినిధి, ఆంగ్ల పాఠ్యపుస్తక రచయిత, ఆంగ్లభాష స్టేట్ రిసోర్స్‌పర్సన్ అల్లం సత్యనారాయణ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెబుతూ వచ్చారు.
దీంతో విద్యార్థులు పరీక్షను చక్కగా రాశారు. తొలుత నాల్గవ కేట గిరీ విద్యార్థులకు ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు, మొదటి కేటగిరీ 12.30 నుంచి ఒంటి గంట వరకు, రెండో కేటగిరీ మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు, మూడో కేటగిరీ సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొదటి కేటగిరీ 29 మంది, రెండో కేటగిరీకి 113 మంది, మూడో కేటగిరీ 137 మంది, నాలు గో కేటగిరీకి 113 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వైఎస్ఆర్ జిల్లాతో పాటు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లా ల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ కడప యూనిట్ మేనేజర్ డి.సుబ్బారెడ్డి, యాడ్స్ మేనేజర్ చాముండేశ్వరి పాల్గొన్నారు.