అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టు
=11 మందిని అరెస్టు చేసిన రాయ్‌గఢ్ పోలీసులు
=నిందితుల్లో ఇద్దరు పుణే పోలీసులు
=మహారాష్ట్రతో పాటు నగరంలోనూ దోపిడీ
=వివరాలు ఆరా తీసున్నాం: ఖోపోలి ఇన్స్పెక్టర్
సాక్షి, సిటీబ్యూరో: ‘చోర్-పోలీసు భాయి భాయి’ ట్రెండ్ నగరంలోనే కాదు... మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లోనూ కొనసాగుతోంది. అక్కడి పోలీసులు అరెస్టు చేసిన ఓ ముఠాలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరి విచారణ నేపథ్యంలోనే ఈ గ్యాంగ్ హైదరాబాద్‌లోనూ నేరం చేసినట్లు వెల్లడించింది. అయితే, పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని ఖోపోలీ పోలీసు ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ శుక్లా ‘సాక్షి’కి తెలిపారు. ముంబై సాంగ్లీలోని అట్మాడీలో సునీల్ కాదమ్ హోల్‌సేల్ బంగారం షాపు నిర్వహిస్తున్నారు. ఇందులోని ఉద్యోగులు మారుతి లోఠే, సచిన్ టక్లే, అమోల్ మోర్ ఈనెల 10న సంస్థకు చెందిన రూ.1.29 కోట్ల విలువైన నగదు, బంగారంతో ముంబై నుంచి బెంగళూకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేలోని ఖోపోలీ వద్ద ఉన్న ఓ ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగినప్పుడు ఇద్దరు వ్యక్తులు పుణే పోలీసులమంటూ వారి వద్దకు వచ్చారు.
బాంబు పేలుడు కేసు అనుమానితులంటూ...
ఇటీవల జరిగిన ఓ బాంబు పేలుడు కేసులో ఈ ముగ్గురూ అనుమానితులని, అందుకే అరెస్టు చేస్తున్నామ మిగతా ప్రయాణికులకు ఆ ఇద్దరూ చెప్పారు. మారుతి లోఠే, సచిన్ టక్లే, అమోల్మోర్లను సొత్తుతో సహా బస్సులోంచి బయటకు తీసుకొచ్చారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మరో ఐదుగురు వచ్చారు. అంతా కలిసి ముగ్గురినీ ఠాణాకు తరలిస్తున్నామని చెప్పి టవేరా వాహనంలో తీసుకెళ్లారు. లోనావాలాలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి.. దాడి చేసి ఉద్యోగుల వద్ద ఉన్న బంగారంతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న షాపు యజమాని సునీల్ కాదమ్ ఖోపోలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న రాయ్‌గఢ్ ఎస్పీ అంకుష్ షిండే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
గ్యాంగ్‌లో ఇద్దరు పోలీసుల సహా పది మంది...
నేరం జరిగిన తీరును అధ్యయనం చేసిన పోలీసులు ఆ ముగ్గురు ఉద్యోగులు నగదు, సొత్తుతో ప్రయాణిస్తున్నారనే కచ్చితమైన సమాచారంతోనే దుండగులు విరుచుకుపడ్డారని నిర్థారించుకుని ఆ కోణంలో ఆరా తీశారు. సంస్థకు చెందిన అనేక మంది ఉద్యోగుల్ని, హోల్‌సేల్ వినియోగదారుల్నీ ప్రశ్నించిన అధికారులు చివరకు సాంగ్లీకి చెందిన తులసీరామ్ దాల్వే, సుదర్శన్ జవార్లు ముగ్గురి వద్ద బంగారం ఉన్న సమాచారం దోపిడీ దొంగలకు అందించినట్టు నిర్థారించారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పుణే జిల్లాలోని డెక్కన్, భోసారీ పోలీసుస్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లు అశిష్ పవార్, సంపత్ పార్థీలు ముఠాకు సూత్రధారులుగా తెలిసింది. బుధవారం ఈ నలుగురితో పాటు ముఠాకు చెందిన అమోల్ ఘోద్డే, దీపక్ నర్వాడీ, ప్రకాష్ చవాన్, సునీల్ దాటే, శంకర్ జద్వా, హీరామన్ శాల్ఖేలను అరెస్టు చేశారు.
నగరంలో 8 కేజీల వెండి దోపిడీ...
ఈ ముఠాను రాయ్‌గఢ్ న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు కోర్టు అనుమతితో గురువారం నుంచి కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ గ్యాంగ్ హైదరాబాద్ సమీపంలోని హైవేపై ఇదే తరహాలో మరో నేరం చేసినట్లు బయటపెట్టింది. ఈ ముఠా అరెస్టు సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ శుక్రవారం ఫోన్లో ఖోపోలీ పోలీసు ఇన్స్పెక్టర్ శుక్లాను సంప్రదించగా... ‘పది మంది నిందితుల్లో ఒకడు ఈ విషయం బయటపెట్టాడు. తన గ్రామానికే చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో 8 కేజీల వెండి దోపిడీ చేసినట్లు బయటపెట్టాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాల్సి ఉంది. ఈనెల 27 వరకు నిందితులు మా కస్టడీలోనే ఉంటారు. ప్ర స్తుతం రూ.1.29 కోట్ల విలువైన నగదు, సొత్తు రికవరీపై దృష్టి పెట్టాం. ఇది పూర్తయ్యాక హైదరాబాద్ కేసు వివరాలు సేకరించి, అక్కడి పోలీసులకు సమాచారం ఇస్తాం’ అని అన్నారు.