కేసీఆర్ 20ఏళ్ల క్రితమే సీఎం కావాల్సింది : జడ్జి
నిడమనూరు : తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టడానికి కేసీఆర్ 20ఏళ్ల క్రితమే సీఎం ఐతే బాగుండేదని నిడమనూరు మున్సిఫ్కోర్టు జడ్జి పద్మజ అన్నారు. నిడమనూరులోని ఆదర్శపాఠశాలలో బుధవారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జి పద్మజ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం 20ఏళ్ల క్రితమే చేపడితే ఎంతో బాగుండేదని, కేసీఆర్ సీఎం కావడంతో ఇప్పుడు చేపట్టాడని అన్నారు. తల్లిదండ్రుల, గురువుల సూచనల, అభిప్రాయాల మేరకు విద్యార్థులు నడుచుకుని ఉన్నత చదువులు అభ్యసించాలన్నారు. తహసీల్దార్ మందడి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి బాధ్యతగా ఒక మొక్క సంరక్షణ ఇవ్వాలని, ఆమేరకు ఉపాధ్యాయులు రికార్డు మెయింటెనెన్స్ చేయాలన్నారు. సమావేశం అనంతరం జడ్జి పద్మజతో పాటు నాయకులు, అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు జడ్జికి, ప్రజాప్రతినిధులకు ఘనస్వాగతం పలికారు. ఆదర్శపాఠశాల ప్రిన్సిపాల్ రంజిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ దాసరి నర్సింహ, వైఎస్ ఎంపీపీ మంజుల సీతారాములు, ఎంపీడీఓ ఇందిర, ఏపీఓ సత్యనారాయణ, ఎస్ఐ నర్సింహరాజు, సర్పంచ్ రుద్రాక్షి ముత్తయ్య, ఎంఈఓ బాలునాయక్, ఉన్నం చిన వీరయ్య పాల్గొన్నారు.