వైఎస్సార్ సీపీ విజయానికి కృషిచేస్తా
నరసరావుపేట వెస్ట్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల విజయం కోసం క్రియాశీలకంగా కృషిచేస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎన్సీవీ అధినేత నల్లపాటి రామచంద్రప్రసాదు (రాము) చెప్పారు. ఈనెల 27న హైదరాబాద్‌లో జననేత వైఎస్జగన్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.
ఆదివారం రామిరెడ్డిపేటలోని పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి గృహంలో రాము విలేకరులతో మాట్లాడారు. జనభేరి సమయంలో తన కుటుంబంపై గౌరవంతో వైఎస్ జగన్మోహనరెడ్డిని తమ ఇంటికి తీసుకొచ్చినందుకు మర్రి రాజశేఖర్, డాక్టర్ శ్రీనివాసరెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. జగన్ మాట ఇస్తే తప్పడనే విశ్వాసం తనకు ఉందన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ నల్లపాటి రామచంద్రప్రసాదు చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ఖాయమని, రాముతోపాటు అందరినీ మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నల్లపాటి కుటుంబానికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు.
కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర గజ్జల బ్రహ్మారెడ్డి, కపలవాయి విజయకుమార్, లాం కోటేశ్వరరావు, మేడికొండ నరసింహారావుచౌదరి తదితరులు పాల్గొన్నారు.