వైరల్: నలుగురిని కాపాడిన యాచకుడు
నందలూరు (రాజంపేట): ఈతకు వెళ్లి నీటి గుంతలో కూరుకుపోయిన ఐదుగురిలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురిని ఒక యాచకుడు కాపాడాడు. ఈ ఘటన చెయ్యేటి రైల్వే వంతెన వద్ద సోమవారం చోటు చేసుకుంది. చెయ్యేటి గ్రామమైన కుమ్మరపల్లె (నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధి)కు చెందిన ఐదుగురు విద్యార్ధులు సరదగా ఈత కొట్టడానికి రైల్వే వంతెనకు చేరుకున్నారు. ఇసుక కోసం గోతులు తీయడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో ఇటీవల వర్షానికి భారీగా నీరు చేరింది.
ఈ గుంతల్లో ఈత కొడుతూ ఐదుగురూ లోపలకు కూరుకుపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు కేకలు వేయడంతో గమనించిన ఒక యాచకుడు గుంతలోకి దిగి నలుగురిని బయటకు తీసుకొచ్చాడు. అయితే ఆదిత్య (16) బయటకు రాలేక మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా మృతి చెందిన విద్యార్థి తండ్రి రమేశ్ గతంలోనే చనిపోయాడు. ఒకగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి శైలజ రోదించడం అందరినీ కలచివేసింది.