పాలు పట్టే ముందు... ఆ మూడూ పట్టకండి!
‘తల్లి పాలు బిడ్డకు అమృతం’ అని రోజూ స్మరిస్తూ ఉంటాం. కానీ అవి పిల్లల ఆరోగ్యానికి ఏ పరిస్థితుల్లో క్షేమమో ముందు తెలుసుకోండి. తల్లిపాల అవసరం పిల్లలకు ఎంతో ఉందన్నది వాస్తవం. మరి అలాంటప్పుడు ఆ బిడ్డలు తమ పాలు తాగి ఆరోగ్యంగా ఉండాలంటే తల్లులు ఏం చేయకూడదో కూడా గ్రహించడం మంచిది కదా. ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విద్యార్థులు వెల్లడించిన పరిశోధన ఫలితాలను గమనిస్తే ప్రతిరోజూ మనం ఎంత తప్పు చేస్తున్నామో అర్థమవుతుంది. ఇంట్లో నాన్‌స్టిక్ ప్యాన్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు వాడటం ఎంత ప్రమాదమో తెలుస్తుంది. వాటికీ, తల్లి పాలకు ఏం సంబంధం అనుకుంటున్నారా? ఉంది.. దగ్గర సంబంధమే ఉంది.
ఈ వస్తువుల్లో ఉండే పీఎఫ్ఏ (పర్‌ఫ్లోరినేటెడ్ ఆల్కలేట్) అనే రసాయనం తల్లి తినే ఆహారంలోకి చేరి స్తన్యం ద్వారా శిశువులపై ప్రభావం చూపుతుందట.
అంతేకాదు, ఈ పరిశోధనలో తేలిన ఎన్నో అంశాలు భయాందోళనకు గురి చేస్తున్నాయంటున్నారు డాక్టర్లు. ఈ పీఎఫ్ఏలు పిల్లలలో చేరి కాలేయం, ఒబెసిటి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడేలా చేస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్ది ఆ పీఎఫ్ఏ శాతం వారి శరీరంలో పెరుగుతుందట. దాంతో వారిలో రోగనిరోధక శక్తి తగ్గి ఎప్పుడూ అనారోగ్యం పాలవుతారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని... కాబోయే తల్లులు ఇంట్లో నాన్‌స్టిక్ ప్యాన్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, మైక్రో ఒవెన్లు ఉపయోగించడం మానేసి పసి పిల్లల ఆరోగ్యాలను కాపాడాలని వైద్యులు సూచిస్తున్నారు.