పేలుడు కలకలం
వెంకటగిరిటౌన్, న్యూస్‌లైన్ :వెంకటగిరి-నాయుడపేట మార్గంలో స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం పెద్ద పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్ ప్రాంతంలో కల్వర్టు సమీపంలో కంపచెట్లు తగలబడ్డాయి. ఆ సమయంలో అక్కడ పెద్ద పేలుడు సంభవించింది. దీంతో భయాందోళలకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానిక సీఐ నరసింహరావు, ఎస్సై పీవీ నారాయణ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతంలో మంటలను అదుపు చేశారు. సంఘటన స్థలాన్ని సీఐ క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడు కారణంగా కల్వర్టు ఓ వైపు గోడ దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాంబ్‌స్క్వాడ్ బృందాన్ని రప్పించారు. ఆ బృందం సభ్యులు పరిశీలించి పేలుడుకు కారణం బాంబులు కావని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో టాబ్లెట్లు మండి ఉండటం, సీసాలు మంటల్లో కాలడం వల్ల పెద్ద పేలుడు సంభవించి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు